BJP MP Arvind: ఔను.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:54 AM
ఔను.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది.. సందేహం ఉంటే వెళ్లి చూసుకోండి అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
మహేశ్‌గౌడ్‌కు ఎంపీ అర్వింద్ స్పష్టీకరణ
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘ఔను.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది.. సందేహం ఉంటే వెళ్లి చూసుకోండి’ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ‘కాంగ్రెస్సే ముస్లిం.. ముస్లింలే కాంగ్రెస్ అని మీ సీఎం రేవంత్ ప్రకటించారు కదా.. మరి ఆ అంశం మీ పార్టీ రాజ్యాంగంలో ఉందా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ను అర్వింద్ ప్రశ్నించారు. హిందువులా? ముస్లింలా? అని చూసి మరీ పహల్గాంలో టెర్రరిస్టులు మారణకాండకు పాల్పడ్డా కాంగ్రెస్ నాయకులకు బుద్ధిరాలేదని మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అర్వింద్ మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం రేవంత్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. రేవంత్ సీఎం అయ్యాక, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటివరకు 9 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడులు మతకల్లోలాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాతబస్తీ నుంచి హిందువులను తరిమివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హిందూ దేవుళ్లపై ఒట్టేసి హామీలిచ్చి అమలు చేయని రేవంత్, అల్లాపై ఒక్క ఒట్టయినా వేశారా? అని అర్వింద్ ప్రశ్నించారు. ఇందూరు పేరును నిజాం.. నిజామాబాద్ అని మార్చారని, ఒక హంతకుడైన నిజాం పేరును ఎంతో చారిత్రక నేపథ్యమున్న నిజామాబాద్ జిల్లాకు ఎలా కొనసాగిస్తాం?’ అని నిలదీశారు. ఇందూరు మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటామని, జిల్లా పేరు మార్పే తమ మొదటి తీర్మానం అని అర్వింద్ ప్రకటించారు. బీజేపీ ఎక్కడ ఉందో మీ చెల్లి కవితను అడిగితే చెబుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అర్వింద్ సూచించారు. కేటీఆర్, కవితలను రాజకీయాల్లోకి తీసుకురావడం కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు అని ఆయన ఎద్దేవా చేశారు.