Homemade Winter Soup Recipes Special: వేడి వేడిగా వెరైటీ సూప్‌లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:35 AM
Winter Special Hot and Delicious Continental Soup Recipes to Try at Home
వంటిల్లు
చలికాలంలో వేడి వేడిగా ఏదైనా సూప్ తాగితే హాయిగా అనిపిస్తుంటుంది. అందుకే ఈ సమయంలో అందరూ టమాటా సూప్, వెజిటబుల్ సూప్, చికెన్ నూడుల్స్ సూప్‌లాంటి రకాలను ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. వీటికి భిన్నంగా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోదగ్గ కాంటినెంటల్ సూప్‌ల వివరాలు మీకోసం...

బటర్నట్ స్క్వాష్ సూప్
కావాల్సిన పదార్థాలు
బటర్నట్ స్క్వాష్ (తీపి గుమ్మడికాయ)- చిన్నది, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, ఎండు మిర్చి- మూడు, మిరియాలు- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, వెల్లుల్లి తరుగు- ఒక చెంచా, అల్లం తురుం- ఒక చెంచా, సన్నగా తరిగిన ఉల్లికాడలు- రెండు చెంచాలు, బటర్- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్- ఒక చెంచా
తయారీ విధానం
తీపి గుమ్మడికాయకు తొక్క తీసి మధ్యకు కోసి గింజలు తొలగించాలి. ఆపైన చిన్న ముక్కలుగా తరిగి గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి పాన్ పెట్టి చెంచా బటర్ వేసి కరిగించాలి. తరువాత ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత తీపి గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలపాటు మగ్గించాలి. ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ మీద నుంచి దించి చల్లార్చాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి కొన్ని నీళ్లు చిలకరించి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ పేస్టుని గిన్నెలోకి తీసుకుని రెండు గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. ఆపైన గిన్నెను స్టవ్ మీద పెట్టి మూడు నిమిషాలపాటు మిశ్రమాన్ని మరిగించాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి చెంచా బటర్ వేసి అది కరిగిన తరువాత వెల్లుల్లి తరుగు, అల్లం తురుం, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించి మరుగుతున్న గుమ్మడి ముక్కల సూప్‌లో వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత స్టవ్ మీద నుంచి దించి కొద్దిగా కొత్తిమీర తరుగు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

మినిస్ట్రోన్ సూప్
కావాల్సిన పదార్థాలు
క్యాబేజీ తరుగు- అర కప్పు, టమాటాలు- రెండు, కేరట్ ముక్కలు- ఒక కప్పు, సెలెరీ తరుగు- అర కప్పు, జుకిని ముక్కలు- అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, ఉడికించిన రెడ్ బీన్స్- ఒక కప్పు, బిరియానీ ఆకు- ఒకటి, వెల్లుల్లి తరుగు- రెండు చెంచాలు, ఉడికించిన వీట్ పాస్తా- అర కప్పు, ఆలివ్ ఆయిల్- మూడు చెంచాలు, ఉప్పు- తగినంత, కారం- అర చెంచా, చీజ్ తురుం- ఒక చెంచా, మిరియాల పొడి- అర చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ఫ టమాటాల మీద రెండు గాట్లు పెట్టి గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత టమాటాలకు తొక్క తీసి మిక్సీలో వేసి ఉడికించిన నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ ప్యూరీని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి వేడిచేయాలి. ఆపైన వెల్లుల్లి తరుగు, బిరియానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, కేరట్ ముక్కలు, పావు చెంచా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి రెండు నిమిషాలపాటు మగ్గించాలి. తరువాత జుకిని ముక్కలు, సెలెరీ తరుగు, టమాటా ప్యూరీ, కారం వేసి కలిపి పది నిమిషాలపాటు వేగనివ్వాలి. ఆపైన అయిదు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. తరువాత రెడ్ బీన్స్, వీట్ పాస్తా, చీజ్ తురుం, మిరియాల పొడి వేసి కలిపి ఉప్పు సరిచేసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ సూప్‌లో ఆలు, బీన్స్, బీట్‌రూట్ లాంటి ఇతర కూరగాయల ముక్కలను కూడా ఉడికించి వేసుకోవచ్చు.
థాయ్ చికెన్ సూప్
కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ ముక్కలు- పావు కేజీ, మష్రూమ్స్- నాలుగు, చక్కెర- చిటికెడు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, లెమన్ గ్రాస్- కొద్దిగా, ఉప్పు- తగినంత, ఫిష్ సాస్- ఒక చెంచా, నిమ్మరసం- ఒక చెంచా, కొబ్బరి పాలు- ఒక కప్పు, థాయ్ పేస్టు- రెండు చెంచాలు, థాయ్ జింజర్ తరుగు- అర చెంచా, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, తులసి ఆకులు- కొన్ని
తయారీ విధానం
ఫ స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో థాయ్ జింజర్, లెమన్ గ్రాస్, చికెన్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు వేసి కలిపి పది నిమిషాలపాటు వేయించాలి. తరువాత కొబ్బరిపాలు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆపైన థాయ్
పేస్టు, ఉప్పు, చక్కెర, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, ఫిష్ సాస్ వేసి కలిపి మరో అయిదు నిమిషాలు మరిగించాలి. చివరగా తులసి ఆకులు వేసి స్టవ్ మీద నుంచి దించి వేడిగా సర్వ్ చేయాలి.

పొటాటో లీక్ సూప్
కావాల్సిన పదార్థాలు
లీక్ తరుగు- ఒక కప్పు, ఆలుగడ్డ ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, బటర్- రెండు క్యూబ్‌లు, వెల్లుల్లి తరుగు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, చికెన్ స్టాక్- మూడు గ్లాసులు, మిరియాల పొడి- ఒక చెంచా, ఫ్రెష్ క్రీమ్- అర కప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి బటర్ వేసి కరిగించాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. తరువాత లీక్ తరుగు, ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పదినిమిషాలపాటు మగ్గించాలి. తరువాత చికెన్ స్టాక్ పోసి పావుగంటసేపు మరిగించి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో పోసి మెత్తగా బ్లెండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గిన్నెను మరల స్టవ్ మీద పెట్టి సూప్‌ను మరిగించాలి. అందులో మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ సూప్‌లో లీక్‌కు బదులు స్ర్పింగ్ ఆనియన్స్ వాడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
Read Latest AP News And Telugu News