Medaram Jatara 2026: మేడారానికి తరలివెళ్తున్న భక్త జనం.. వనదేవతల సన్నిధిలో భారీ రద్దీ!
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:32 PM
సమ్మక్క, సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి పెద్ద వనదేవతల జాతర. దేశ వ్యాప్తంగా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి లక్షల మంది భక్తజనం తరలి వస్తుంటారు.
ములుగు: సమ్మక్క-సారలమ్మ ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర(Medaram jatara)కు భక్తులు ముందుగానే తరలివెళ్తున్నారు. దీంతో మేడారంలోని గద్దెల ప్రాంగణంతోపాటు జంపన్న వాగు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వాస్తవానికి జనవరి 28 నుంచి 31 వరకూ మహాజాతర కొనసాగనుంది. కానీ, అప్పటికి విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకొని వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.
భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకొని పుసుకు, కుంకుమ సమర్పిస్తారు. అలాగే వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) తూకంలో సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ములుగు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వస్రా, తాడ్వాయి పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు.
గతంలో తలెత్తిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులతోపాటు గద్దెల వద్ద క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. బస్టాండ్ తో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా పోలీసులకు, వాలంటీర్లకు, అధికారులకు భక్తులు సహకరించాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు. ఈ రోజు(ఆదివారం) తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క మేడారాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బండ్ల గణేశ్ మహా పాదయాత్ర.. ఎందుకంటే..
టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..
Read Latest Telangana News And Telugu News