హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:13 AM
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాల వసతిగృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
మహబూబాబాద్ గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో ఘటన
నెహ్రూసెంటర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాల వసతిగృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని బుధవారం తెల్లవారుజామున హాస్టల్ బాత్రూంలో ప్రసవించగా.. అప్పుడే పుట్టిన మగ శిశువు మృతి చెందాడు. విద్యార్థిని ప్రస్తుతం మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఓ తండాకు చెందిన విద్యార్థిని.. మహబూబాబాద్ గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది.
జూలై 15న కళాశాలలో చేరిన ఆమె, అప్పటికే గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కళాశాల సిబ్బందికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలియకుండా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కడుపునొప్పిగా ఉందంటూ బాత్రూంకు వెళ్లిన విద్యార్థిని అక్కడే ప్రసవించింది. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే శిశువుతో పాటు ఆమెను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News