మేడారంలో.. జోరుగా ముందస్తు మొక్కులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:54 AM
మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ప్రారంభం రోజైన బుధవారం భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగానే మేడారాని చేరుకుని తమతమ మొక్కులతను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం భక్తజన గూడారంగా మారిపోయింది.
2 లక్షల మందికి పైగా రాక
24 గంటల పాటు కొనసాగుతున్న దర్శనాలు
తాడ్వాయి(ములుగు): మేడారం(Medaram) వనదేవతలు సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తులు సోమవారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మహా జాతరకు ముందుగా మొక్కులు చెల్లించుకున్నారు. ఎత్తుబంగారం(బెల్లం), పూలు, పండ్లు, చీరె, సారె, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. యాట మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, కల్యాణ కట్టల్లో తలనీలాలు సమర్పించారు.
శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాలతో వనదేవతల గద్దెలకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో మేడారం పరిసరాలన్నీ కిటకిటలాడాయి. సోమవారం 2లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు, పోలీసులు అంచనాలు వేశారు.
24 గంటలపాటు దర్శనాలు
మేడారం వనదేవతలను దర్శించుకోవడానికి ముందస్తుగా తరలివస్తున్న భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు 24గంటలపాటు సమ్మక్క- సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దేవతల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. పగలు భక్తుల రద్దీ అధికంగా ఉంటున్న నేపథ్యంలో గద్దెల గేట్లకు తాళాలు వేస్తున్నారు. రాత్రిళ్లు మాత్రం భక్తుల తాకిడి తక్కువగా ఉంటుండడంతో గేట్లు తీసి నేరుగా తల్లుల గద్దెలను దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News