Share News

హింసను ప్రశ్నించినా బెదిరింపులే!

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:30 AM

బీజేపీవి ప్రజా వ్యతిరేక విధానాలని, ఆ విషయం దేశవ్యాప్తంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలె అన్నారు.

హింసను ప్రశ్నించినా బెదిరింపులే!

  • ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై తీవ్ర హింస

  • ప్రశ్నించినవారికి బీజేపీ బెదిరింపులు

  • ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం

  • 14వ మహాసభల్లో నాలుగు తీర్మానాలు

  • ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి

హైదరాబాద్‌, జనవరి 26(ఆంధ్ర జ్యోతి): బీజేపీవి ప్రజా వ్యతిరేక విధానాలని, ఆ విషయం దేశవ్యాప్తంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలె అన్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై హింస జరుగుతున్నా.. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేని భయంకర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఉద్యమకారులను బీజేపీ నాయకులు పదేపదే బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఐద్వా 14వ మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మణిపూర్‌లోని సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారని విమర్శించారు. పుదుచ్చేరిలో రేషన్‌కు బదులు నేరుగా నగదు ఇస్తుండటంతో పేదల ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒడిశాలో కుష్ఠురోగులకు సేవలందించిన గ్రాహం స్టెయిన్స్‌, ఆయన కుమారులను సజీవ దహనం చేసిన కేసులో దోషి ధారాసింగ్‌ను బీజేపీ అధికారంలోకి రాగానే జైలు నుంచి వదిలేసిందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలను, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ.. పాలస్తీనా, వెనెజువెలాకు సంఘీభావం తెలుపుతూ మహాసభల్లో తీర్మానాలు ఆమోదించినట్లు ఐద్వా అఖిల భారత అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి టీచర్‌ తెలిపారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఒక తీర్మానం, మైనార్టీలపై దాడులకు నిరసనగా మరో తీర్మానం ఆమోదించినట్లు వెల్లడించారు. కాగా, ఐద్వా మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీ ఆకట్టుకుంది.

Updated Date - Jan 27 , 2026 | 04:30 AM