చైనా మాంజాకు ఐదేళ్ల బాలిక బలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:28 AM
మృత్యుపాశంగా మారిన చైనా మాంజాకు మరో నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో కలిసి ఐదేళ్ల బాలిక బైక్ మీద వెళుతుండగా..
తల్లిదండ్రులతో కలిసి బైక్ మీద వెళుతుండగా గొంతుకు తగిలిన మాంజా.. లోతుగా తెగి తీవ్ర గాయం
ఆస్పత్రికి తరలించేలోపు తండ్రి చేతుల్లోనే మృతి
మూసాపేట్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మృత్యుపాశంగా మారిన చైనా మాంజాకు మరో నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో కలిసి ఐదేళ్ల బాలిక బైక్ మీద వెళుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ మాయదారి చైనా మాంజా ఆ చిన్నారి మెడకు బిగుసుకుంది. తగిలీ తగలగానే గొంతు కోసుకుపోయింది. ధారగా రక్తం పోతుండగా అపస్మారక స్థితికి చేరుకున్న బిడ్డను ఆ తండ్రి చేతుల్లోకి తీసుకొని.. ఆస్పత్రికి తరలించేలోపే చిన్నారి మృతిచెందింది. ఈ హృదయవిదారకమైన ఘటన కూకట్‌పల్లిలో జరిగింది. గోకుల్‌ఫ్లాట్స్‌కు చెందిన ప్రేమ్‌సాగర్ అనే యువకుడు సాప్ట్‌వేర్ ఇంజనీర్. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లున్నారు. ప్రేమ్‌సాగర్ సోమవారం భార్యాపిల్లలతో కలిసి బైక్‌పై నిజాంపేట కొత్త ఇంటి పనులు జరుగుతున్న సైట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి కూకట్‌పల్లిలోని ఓ జ్యువెలరీ దుకాణంలో స్కీం డబ్బు కట్టేందుకు బయలుదేరారు. జువెలరీ దుకాణం దాటి కాస్త ముందుకు వెళ్లినట్లు గుర్తించిన ప్రేమ్‌సాగర్ యూటర్న్ తీసుకున్నాడు. కూకట్‌పల్లి వివేకానందనగర్ పిల్లర్ నంబర్ 781 వద్దకు రాగానే బైక్ పెట్రోలు ట్యాంక్ మీద కూర్చున్న చిన్న కూతురు నిశ్విక ఆదిత్య (5) గొంతుకు చైనా మాంజా చుట్టుకుంది. తీవ్రంగా గాయపడిన బాలికను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కంటికీమంటికి ధారగా రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరివల్లా కాలేదు.