Share News

మూగజీవాలకు వడదెబ్బ.. ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

ABN , Publish Date - May 01 , 2026 | 10:53 AM

వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి.

మూగజీవాలకు వడదెబ్బ..  ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు
Summer

  • జిల్లా వ్యాప్తంగా సుమారు 28 లక్షల పశుసంపద

  • జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

వరంగల్: వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి. ఎండ వేడిమికి రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నాయి. వేసవిలో పశుపోషణలో సరైన పద్ధతులు పాటించకపోతే పశువులు వడదెబ్బకు గురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 28 లక్ష ల పశుసంపద ఉన్నట్లు అంచనా. జిల్లాలో రెండు ప్రాంతీయ వైద్యశాలలతో పాటు, 24 ప్రాథమిక పశు వైద్యకేంద్రాలు, 31 పశువైద్య ఉప కేంద్రాలు, 3 సంచార పశు వైద్యశాలలతో పశు సంవర్ధక శాఖ అధికారులు సేవలందిస్తున్నారు.


కాగా, వేసవి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 42 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో గేదెలు, ఆవులు, గొర్రెలు,మేకలు,పందులు, కోళ్లు, బాతులు తదితర పశుసంపద పట్ల జాగ్రత్తలు వహించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్ర త, అధిక ఉష్ణోగ్రత, వడగాలుల వల్ల ఉష్ణతాపానికి గురై పాడి పశుసంపదలో రోగనిరోధకశక్తి తగ్గి, అనారోగ్యానికి గుర య్యే అవకాశలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచడం వల్ల వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతులు ఆశించిన ఫలితాలను పొందవచ్చని సూచిస్తున్నారు.


అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా మారుతాయని, పశువులు సరిగా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయని, వడదెబ్బ తగిలిన పశువులకు జీర్ణక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహారం తక్కువగా తీసుకోవడం జరుగుతుందని చెబుతున్నారు.


వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం పెరుగుతుందని, కొన్ని సందర్భాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యా ధులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. పాడి పశువులలో గర్భస్రావాలు సం భవించే అవకాశం ఉందని, వడదెబ్బకు గురైన వాటిలో దాహం పెరిగి, తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కోసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణిస్తాయని హెచ్చరిస్తున్నారు.


hnk1.jpgమేతలో జాగ్రత్తలు తప్పనిసరి..

పాడిపశువులలో వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుందని, అందువల్ల సులువుగా జీర్ణమయ్యే గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిదని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలని, ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చని, పచ్చిగడ్డిని ఉదయంవేళలో ఎండుగడ్డిని రాత్రి సమయాలలో ఇవ్వాలని చెబుతున్నారు. అధిక పాలు ఇచ్చే పశువులకు పశుదాణా నీటిలో కలిపి ఇవ్వాలని, మినరల్‌ మిక్చర్‌, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. మేత కోసం పశువులను ఉదయం 6 నుంచి 10గంటల వరకు, సాయంత్రం 5నుంచి 7గం టల వరకు మాత్రమే బయటకు పంపించాలని చెబుతున్నారు.


ప్రథమ చికిత్స..

వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగటం, తల నుదుటి మీద మంచు ముక్కలు ఉంచడం, చల్లని గోనె సంచిని దానిపై కప్పడం వంటివి చేసి వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలి. పశువైద్యాధికారి పర్యవేక్షణలో గ్లూకోజ్‌ సెలైన్‌, సోడియం క్లోరైడ్‌ అందించాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి అవసరమైన చికిత్స చేయించాలి.


జిల్లాలోని పశుసంపద వివరాలు

గోజాతి పశువులు - 80,756

గేదెజాతి పశువులు - 1,08,757

గొర్రెలు - 6,02,321

మేకలు - 93,614

పందులు - 7,648

కోళ్లు, బాతులు, మొదలైనవి - 18,73,462

ఇతరములు - 2,459

మొత్తం - 27,69,024


పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి

  • డాక్టర్‌ ఎం.బాలకృష్ణ, జాయింట్‌ డైరెక్టర్‌ జిల్లా వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ

వేసవిలో పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పాడిరైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వేస వి తాపానికి గురైన పశువులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గ డం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక టీకాలు ఇదివరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకలలో గాలికుంటు వ్యాధి, గొంతు వాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. వే సవి తాపానికి గురైన పశువులకు ఆరోగ్యసేవల కోసం వెంటనే దగ్గరలోని పశువైద్యాధికారిని సంప్రదించాలి. పాడి సంపదను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిరక్షించుకోవాలి. పశువులను ఎండలో ఎక్కువగా తిప్పకుండా దగ్గరలోనే తాగునీటివసతి ఏర్పాటుచేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

మెట్రో రెండో దశకు లైన్‌క్లియర్‌!

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2026 | 10:53 AM