రోడ్లపై డేంజర్ స్టంట్లు
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:59 AM
రోడ్లపై యువత చేసే బైకు విన్యాసాలు చూసి వాహనదారులు, బాటసారులు భయం గుప్పిట్లో ప్రయాణాలు చేస్తున్నారు.
యువత బైకు విన్యాసాలతో ఇష్టారాజ్యం
గగుర్పాటు కలిగించేలా వంతెనలు, డివైడర్లపై రైడ్లు
పోలీసులు కళ్లెం వేయాలంటున్న ప్రజలు
వరంగల్: రోడ్లపై యువత చేసే బైకు విన్యాసాలు చూసి వాహనదారులు, బాటసారులు భయం గుప్పిట్లో ప్రయాణాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్‌తో పాటు అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రమాదకరమైన భంగిమల్లో యువత బైకులను డ్రైవింగ్ చేస్తూ రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారు. ప్రధా న కూడళ్లు, ఏరియాల్లో ద్విచక్ర వాహనాల ముందు (వీలీ) వెనుక (స్టాపీ) టైర్లను గాలిలోకి లేపుతూ న్యూసెన్స్ చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నా రు. దీంతో పాటు త్రిబుల్ రైడింగ్‌లో అత్యంత వేగంగా బైకు రేసింగ్ చేస్తూ పెద్ద, పెద్ద శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
స్టంట్‌లు చేసేందుకు ప్రత్యేకంగా బృందాలు గా ఏర్పడి నగరంలోని ప్రత్యేక ప్రాంతాల్లో పోటీలు పడుతున్నట్లు సైతం తెలుస్తోంది. అనంతరం సంబంధిత దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వ్యక్తిగత ఆనందం పొం దుతున్నారు. పోలీస్ శాఖ అప్రమత్తమై రోడ్డుపై జరుగుతున్న వికృత చేష్టలను, ప్రమాదకరమైన బైకు స్టంట్‌లను నియంత్రించకపోతే యువత ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంది.
గగుర్పాటు కలిగించే స్టంట్స్
స్టంట్‌లు వేసేందుకు రోడ్డు ఒక్కటే కాదు.. ట్రైసిటీలోని కాజీపేట, చింతల్, బట్టలబజార్‌లోని ప్లైఓవర్ వంతెనలపై ఉన్న ఫుట్‌పాత్‌లు, డివైడర్స్, కాలనీలు, రాంపూర్ నుంచి అరెపల్లి వరకు ఉన్న ఓఆర్‌ఆర్ పైన, భట్టుపల్లి బైసాస్, అన్నసాగర్ నుంచి కేయూ క్రాస్, నగరంలోని ప్రధాన మార్గాల్లో ఒళ్లు గగుర్పాటు కల్గించేలా ప్రమాదకరమైన భంగిమల్లో స్టంట్‌లకు పాల్పడుతూ యువత పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారు. ముందు టైర్లను గాలిలో లేప డం(వీలీ), వెనుక టైర్లను గాలిలో లేపడం(స్టాపీ),
సైలెన్సర్ నుంచి పొగ వచ్చేలా ఎక్స్‌లేటర్ రేసింగ్ ఇస్తూ బైకును పడుకోబెట్టి వెనుక టైరును తిప్పడం (బర్న్ అవుట్) వంటి ప్రమాదకరమైన స్టంట్‌లు చేస్తూ రోడ్లపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. స్టంట్‌లు చేయడమే కాకుండా వాటిన్నింటిని వీడియోలో బంధించి వ్యూస్ పిచ్చితో ఇన్‌స్టాల్, రీల్స్‌తోపాటు ఇతర సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ అమాయక యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రత్యేకంగా కళాశాల పరిసరాలు, బస్టా్‌పల వద్ద అమ్మాయిలను ఆకర్షించేందుకు బైక్ స్టంట్‌లను చేస్తూ సంతోషం పొందుతున్నారు.
పోలీసులు అప్రమత్తం కావాలి..
ప్రాణాలకు అపాయం ఉన్న బైక్టు స్టంట్స్‌పై ట్రైసిటీలో ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రత్యేకంగా కాజీపేట, హనుమకొండ, సుబేదారి, మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్ హసన్‌పర్తి, కేయూసీ, ఏనుమాముల పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రమాదకరమైన స్టంట్స్ ద్వారా యువత ప్రాణాలు గాలిలో కలవడం లేదా కాళ్లు, చేతులు విరిగి నడవలేని స్థితిలో అచేతనంగా పడి ఉండటమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే అమాయకులైన వాహనాదారులకు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
పైగా స్టంట్స్‌తో వాహనాలు మరమ్మతులకు గురయ్యే ఆవకాశం ఉంది. ఇన్ని సమస్యలున్న చట్ట నిషేధమైన స్టంట్స్‌కు కళ్లెం వేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఈ మధ్య ప్రధాన కూడళ్లల్లో చేసిన బైకు విన్యాసాలు సోషల్‌మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటే మిగతా వారు ఈ స్టంట్‌ల జోలికి రాకుండా ఉంటారని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి
Read Latest AP News And Telangana News And International News And Telugu News