ఆదాయానికి మించి ఆస్తులు.. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:47 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.
వరంగల్, జనవరి 21: వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB Raids) బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ క్రమంలో ఆయన్ను విచారించగా.. భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే మంచిరేవులలోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల ఏసీబీ దాడులు చేపట్టింది.
హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం దాదాపు రూ.60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు వెంకట్ రెడ్డి. అదే సమయంలో ఆయన ఉంటున్న ఇంట్లో సోదాలు జరుపగా పెద్ద మొత్తంలో నగదు బయటపడింది. అటు.. నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలోనూ వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. వెంకట్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతుండగా.. విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
కండక్టర్ ప్రాణం తీసిన జీరో టికెట్.. అసలేమైందంటే..
ఆస్పత్రులకు పెరుగుతున్న బాధితులు
Read Latest Telangana News And Telugu News