Share News

cough: ఆస్పత్రులకు పెరుగుతున్న బాధితులు

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:22 AM

కొందరికి మాట పెగలడం కష్టమైపోతోంది. సైగలతో సరిపెడుతున్నారు. ఇంకొందరు మళ్లీ మాట్లాడతామంటూ వెళ్లిపోతున్నారు. సెల్‌ఫోన్లలో చాటింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. వాళ్ల గొంతులన్నీ బొంగురుపోయాయి.

cough: ఆస్పత్రులకు పెరుగుతున్న బాధితులు

తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి: వాతావరణంలో మార్పులు. చలి గాలులు. భోగి మంటల్లో వేసిన ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో ఏర్పడిన గాలి కాలుష్యాన్ని పీల్చడం. వీటితో ఇటీవల గొంతు నొప్పి(లారిన్‌ జైటి్‌స)తో బాధ పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రధానంగా వాతావరణంలో మార్పుల నేపథ్యంలో గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. ఇలా గొంతు నొప్పితో బాధపడుతున్న వారు రోజుకు సగటున 30 నుంచి 40మంది తిరుపతిలోని రుయాస్పత్రికి వస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే రుయాకు దాదాపు 45 మంది ఓపీలు తీసుకుని వైద్య సేవలు పొందారు. పది రోజులుగా గొంతు నొప్పి బాధితుల తాకిడి బాగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గత 25 రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది రుయాకు వచ్చి వైద్యం తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రులకు రోజుకు 50 మంది వస్తున్నట్లు తెలిసింది.

లక్షణాలు :

జ్వరం, జలుబు, దగ్గు, టాన్సిల్‌ వాపు వస్తుంది. మింగేటప్పుడు, మాట్లాడేటప్పుడు గొంతులో నొప్పిగా ఉంటుంది. గొంతు గరగరమంటూ బొంగురు పోతుంది. గొంతులో మంట వచ్చి, ఆహార పానీయాలు తీసుకోవడం కష్టంగా అనిపిస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, పొడి దగ్గు, మెడ చుట్టూ వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు: కాలుష్యం, పొగ, ధూళికి ఎక్కువగా గురి కావడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. గొంతు, నాలుక, స్వరపేటికలో వచ్చే అల్సర్లు కూడా గొంతు నొప్పికి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.


వీలైనంత వరకు ఇంటి వైద్యంతోనే నయం: డాక్టర్‌ శ్రీనివాసులు, రుయాస్పత్రి ఈఎన్టీ నిపుణుడు

ఒక్కసారి గొంతు నొప్పి బారిన పడిన బాధితులు వ్యాధి తీవ్రత పెరగకుండా ఉండటానికి ఇంటి చిట్కాలు ఐదు నుంచి వారం రోజుల పాటు వాడితే చాలు. రోజూ కనీసం ఐదు నుంచి 10 సార్లు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కలించాలి. వేడి పాలు, సూప్స్‌, నిమ్మరసం కలిపిన నీరు తాగడం మంచిది. అల్లం టీ లేకుంటే తేనె తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సలసల కాగిన నీటిలో పసుపు, జండూబామ్‌ వేసి ఆవిరి పీల్చడం వల్ల శ్వాస పీల్చడం సులభం అవుతుంది. ఒక వేళ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే మాత్రం తక్షణం సమీపంలోని ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యంగా వదిలేస్తే వ్యాధి తీవ్రత పెరిగి నిమోనియాకు దారి తీసే అవకాశాలున్నాయి. వీలైనంత వరకు గట్టిగా మాట్లాడకుండా ఉండటం మంచిది.

Updated Date - Jan 21 , 2026 | 03:22 AM