దేవుడి సొమ్ముకు ‘పక్కా’ లెక్కింపు!
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:10 AM
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులు సమర్పించే విరాళాలు, కానుకల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భక్తులు ఆలయాలకు సమర్పించే ప్రతి పైసా ఆలయ ఖజానాకు చేరేలా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నమూనాలో ఓ సమగ్ర ‘డోనర్ పాలసీ’ రూపొందించేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది.
తిరుమల మోడల్‌లో ‘సమగ్ర డోనర్ పాలసీ’..
దాతలు ఇచ్చే ప్రతి పైసా ఆలయ ఖజానాకే
యాదాద్రి నుంచే శ్రీకారం.. వేములవాడ, భద్రాచలం, బాసరకూ విస్తరణ
అయోధ్య ఘటనతో అప్రమత్తమైన సర్కారు
యాదాద్రి (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులు సమర్పించే విరాళాలు, కానుకల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భక్తులు ఆలయాలకు సమర్పించే ప్రతి పైసా ఆలయ ఖజానాకు చేరేలా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నమూనాలో ఓ సమగ్ర ‘డోనర్ పాలసీ’ రూపొందించేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. తిరుమల తరహాలోనే దాతల నుంచి వచ్చే విరాళాలను క్రమబద్దీకరించడం, వారికి కల్పించే దర్శన సదుపాయాలు వసతి సౌకర్యాలను ఓ నిర్దిష్ట విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నారు. అయోధ్య రామాలయం ఆలయ విరాళాలు పక్కదారి పట్టిన అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉండడంతో, రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీటీడీలో అమలుచేస్తున్న డోనర్ సిస్టమ్‌ను అధ్యయనం చేసి, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.
ఈ నూతన విరాళాల విధానాన్ని తొలుత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అమలుచేసి, ఆ తర్వాత వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు వంటి ప్రముఖ ఆలయాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం దాతల నుంచి వచ్చే విరాళాలను స్వీకరించే విషయంలో రాష్ట్రంలో ఎలాంటి ఏకీకృత విధానం లేదు. ఆయా ఆలయ ప్రాంగణాల్లో డోనర్ కౌంటర్లు ఉన్నప్పటికీ, రికార్డుల పర్యవేక్షణ లోపించడం, సరైన రశీదు, గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడంతో దాతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చే దాతలు ఉన్నా.. వారిని స్వాగతించే వ్యవస్థ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కొత్తగా రాబోతున్న ‘డోనర్ పాలసీ’తో విరాళాల స్వీకరణ, డిజిటల్ నమోదు, రశీదుల జారీ, ప్రత్యేక ఖాతాలు, ఆడిటింగ్, వార్షిక నివేదికల వెల్లడి వరకు ప్రతిదశలోనూ ఏకీకృత పద్ధతి అమలులోకి వస్తుంది. టీటీడీ తరహాలోనే పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చే దాతలకు ఆలయం వద్ద ప్రత్యేక ప్రాధాన్యం, వసతి, దర్శన సదుపాయం కల్పిస్తారు. ఈ పారదర్శక చర్యల ద్వారా భక్తుల్లో నమ్మకం మరింత పెరగడంతో పాటు రాష్ట్రంలో ఆలయాల సమగ్ర అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు