బీజేపీ తొత్తు సీఈసీ జ్ఞానేశ్
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:45 AM
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
కమిషనర్లను పట్టించుకోని జ్ఞానేశ్‌ను అభిశంసించాలి
దానంపై సుప్రీంకోర్టు తీర్పు గౌరవిస్తాం
మిగతా 8 ఎమ్మెల్యేల వ్యవహారం భిన్నం:మహేశ్‌గౌడ్
జ్ఞానేశ్‌ను తొలగించాలి: భువనగిరి ఎంపీ చామల
కేంద్రానికి కీలుబొమ్మ సీఈసీ : కూనంనేని
సీఈసీది దేశ ద్రోహ నేరమే: సీపీఐ (ఎంఎల్) - మాస్‌లైన్
నిజామాబాద్/ హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇతర ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలనూ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న జ్ఞానేశ్‌ను చట్టసభల్లో అభిశంసించాల్సిందేనని నిజామాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తేల్చిచెప్పారు. అర్హులైన ఓటర్లు, ఇప్పటికే పలు మార్లు ఓటేసిన వారికీ ‘సర్’ నోటీసులు ఇచ్చి ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అర్హులైన ఓటర్ల తొలగింపునకు విధి విధానాలను రూపొందించడం దారుణమని పేర్కొన్న మహేశ్ కుమార్.. పలువురు ఎన్నికల కమిషనర్‌లు వ్యతిరేకించిన విధానాలను అమలు చేయడం సరి కాదన్నారు.
దేశంలో అత్యున్నత స్వతంత్ర సంస్థగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఆయన అభిశంసనకు ప్రతిపక్షాలతో కలిసి మద్దతు కూడగడతామని చెప్పారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతోపాటు ఆయన్ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మహేశ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు.
దానం నాగేందర్ కేసుతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల వ్యవహారం భిన్నమైనదని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన చేస్తూ.. జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగేలా వ్యవస్థనే మార్చేశారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సర్ ప్రక్రియను నిలిపేయాలన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. దేశ ప్రజల ఓటుహక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘం.. బీజేపీ ఎన్నికల సంఘంగా మార్చిన జ్ఞానేశ్ కుమార్ నేరం దేశ ద్రోహంతో సమానమని సీపీఐ ఎంఎల్ మాన్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా లక్ష్యం.. రాహుల్‌ను ప్రధానిగా చూడడమే
Read Latest Telangana News And AP News And National News
And Telugu News