నా లక్ష్యం.. రాహుల్‌ను ప్రధానిగా చూడడమే
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:31 AM
ఓట్లు, పార్టీలు, నిధులు, ఎన్నికల గుర్తుల దొంగతనం దేశంలో జరుగుతోందని, యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సంఘ్ పరివార్ అంటే దేశ విభజన
గాంధీ పరివార్ అంటే దేశ ఐక్యత
దేశంలో ఓట్లు, నిధులు, గుర్తుల చోరీ
మార్పునకు సూచిక కేరళం
ఇక్కడ అధికారంలో మార్పు వస్తే..
కేంద్రంలోనూ కాంగ్రె్‌సదే అధికారం
ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు స్వీకరణ
సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఓట్లు, పార్టీలు, నిధులు, ఎన్నికల గుర్తుల దొంగతనం దేశంలో జరుగుతోందని, యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును కాపాడాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. సంఘ్ పరివార్ సారథ్యంలోని బీజేపీ దేశాన్ని మతం పేరిట విభజిస్తుంటే.. గాంధీ పరివార్ మాత్రం దేశ ఐక్యతకు కృషి చేస్తోందని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద ఆశలు లేవన్నారు.
జట్పీటీసీగా ప్రజా ప్రాతినిథ్య ప్రస్థానాన్ని 2006లో ప్రారంభించిన తాను.. ఈ రెండు దశాబ్దాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ చీఫ్, సీఎం వంటి పదవులను చూశానని, ఇక తన ముందు ఉన్న ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీని భారత ప్రధాన మంత్రిగా చూడటమేనని పునరుద్ఘాటించారు. కేరళంలో మొదలైన రాజకీయ మార్పు అనే గాలిని దేశంలోని ప్రతి ఇంటికి, వీధికి, గ్రామానికి, నగరానికి, ప్రతి రాష్ట్రానికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్పు గాలులు వీస్తున్నాయని, రాహుల్‌గాంధీ సందేశం ప్రజల్లోకి బలంగా వెళుతోందని చెప్పారు.
దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి కాపాడేందుకు రాహుల్ గాంధీకి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కేరళంలోని నలంబూరులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్- 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ను రేవంత్ రెడ్డి స్వీకరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళంలో కాంగ్రెస్ పార్టీకి ఐదు దశాబ్దాలకుపైగా సేవలందించిన ఆర్యదాన్ ముహమ్మద్.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.
‘‘నీలంబూర్‌తోపాటు కేరళంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక బలమైన శక్తిగా నిలిచారు. జీవితాంతం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పని చేశారు. ప్రస్తుతం మతతత్వ శక్తుల నుంచి ప్రమాదం ఉంది. స్వేచ్ఛ, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను కాపాడటమే ఆర్యదాన్ ముహమ్మద్‌కు నిజమైన నివాళి’’ అని వ్యాఖ్యానించారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తాను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కేరళం రాష్ట్రం వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా తాను నిలవడం మరింత ప్రత్యేకమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా, రాహుల్ గాంధీ నాయకత్వంలోని బృందంలో కార్యకర్తగా తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నానని చెప్పారు.
మార్పు.. కేరళం నుంచే!
దేశ రాజకీయాల్లో కేరళం రాజకీయాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, దేశ రాజకీయాలకు ఈ రాష్ట్రం బెల్ వెదర్ (మార్పునకు సూచి) వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రుతు పవనాల రాక కోసం వాతావరణ నిపుణులు కేరళం వైపునకు ఎలా చూస్తారో.. దేశ రాజకీయాలను అర్థం చేసుకునేందుకు కేరళం రాజకీయాన్ని ఒక సూచికగా చూడవచ్చని వ్యాఖ్యానించారు. ‘‘1991లో కేరళంకు కరుణాకరన్ సీఎంగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఈ రాష్ట్రంలో 1996లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. మళ్లీ 2001లో కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రానికి ఏకే ఆంటోనీ సీఎంగా ఉన్నప్పుడే.. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా 2026లో కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడి నుంచే కొత్త రాజకీయ గాలి మొదలైంది. ఈ గాలి.. దేశవ్యాప్తంగా తుపానుగా మారనుంది’’ అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.
దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని గుర్తించే ఆర్యదాన్ ఫౌండేషన్ చైర్మన్ షౌకత్
రైతులు, వెనుకబడిన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువల పట్ల సీఎం రేవంత్ చూపుతున్న నిబద్ధతను అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించిందని వెల్లడించారు. కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకోపన్యాసం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News