రాష్ట్రంలో కొత్తగా 200 కోర్టులు
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:04 AM
రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. న్యాయస్థానాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కోర్టులపై భారాన్ని తగ్గించేందుకు 33 జిల్లాల్లో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను మంజూరు చేసింది.
హైకోర్టు ప్రతిపాదనల మేరకు జూనియర్ సివిల్ కోర్టులు
మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 70..
వేగంగా విచారణలు, కోర్టులపై భారం తగ్గించే లక్ష్యంతో చర్యలు
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. న్యాయస్థానాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కోర్టులపై భారాన్ని తగ్గించేందుకు 33 జిల్లాల్లో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి.పాపిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిజానికి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 594 అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను, ఆ కోర్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులను మంజూరు చేయాలని రాష్ట్ర హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 29న ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దానిని పరిశీలించిన ప్రభుత్వం మొదటి దశగా 200 కోర్టులను మంజూరు చేసింది. అవసరమైన సిబ్బంది, మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు పేర్కొంది. కోర్టుల ఏర్పాటు, తదనంతర అంశాలకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)కు సూచించింది.
రాజధాని చుట్టూరానే మూడో వంతు
ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 200 జూనియర్ సివిల్ కోర్టుల్లో 71 అంటే దాదాపు మూడో వంతు కోర్టులు గ్రేటర్ హైదరాబాద్, సమీపంలోని మూడు జిల్లాలోనే ఉండటం గమనార్హం. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 25, హైదరాబాద్ జిల్లాలో 16 కోర్టులు ఏర్పాటు కానున్నాయి.
ఇక నల్లగొండ జిల్లాకు 10, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు 8 చొప్పున, హనుమకొండ, కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు 7 చొప్పున, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు 6 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు 5 చొప్పున, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 4, జనగామ, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు 3 చొప్పున, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు 2 చొప్పున, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున జూనియర్ సివిల్ కోర్టులు మంజూరు అయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నా లక్ష్యం.. రాహుల్‌ను ప్రధానిగా చూడడమే
Read Latest Telangana News And AP News And National News
And Telugu News