ధర్మేంద్ర ప్రధాన్‌కు ఏం జరిగిందో.. ప్రధాని మోదీకి అదే జరుగుతుంది: సీఎం రేవంత్
ABN , Publish Date - Oct 08 , 2026 | 07:43 PM
కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పంతాలకు పోకుండా వెంటనే స్పందించాలన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌పై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు (గురువారం) సీఈసీకి వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న రేవంత్.. బీజేపీ తీరును తీవ్రంగా విమర్శించారు.

‘మొదట మతాన్ని, భాషను ఉపయోగించుకుని ప్రధాని మోదీ నెగ్గేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత ఈడీ, సీబీఐ సంస్థలను ఉపయోగించి గెలిచేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ ప్రయోగాలు చెల్లవని 13 కోట్ల ఓట్లు తొలగించి మళ్లీ అధికారం చేపట్టాలనుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు. బ్రిటీషర్స్ సైమన్ కమిషన్ వాడితే, బీజేపీ ఎన్నికల కమిషన్ వాడుతోందని ఆరోపించారు. నాడు భగత్ సింగ్ పోరాటం చేస్తే నేడు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు. బలహీన వర్గాల వారి ఓట్లను కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు. ఓట్ల తొలగింపు కాంగ్రెస్ సమస్య కాదని దేశ ప్రజల సమస్య అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పంతాలకు పోకుండా వెంటనే స్పందించాలన్నారు. లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఏం జరిగిందో ప్రధాని మోదీ విషయంలో కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు. అక్రమ ఓట్ల తొలగింపు ద్వారా రెండు రకాల పౌరులు ఏర్పడుతున్నారని రేవంత్ వివరించారు. ఓటు ఉన్నవారు ఓటు లేని వారిని ద్వితీయ పౌరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ వార్తలూ చదవండి
ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్.. తర్వాత నిరసన’ ఫార్ములా!
ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..