డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Apr 13 , 2026 | 10:48 AM
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధుల నుంచి తిరిగి వస్తూ కల్వర్ట్ గుంతలో పడి కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
వికారాబాద్, ఏప్రిల్ 13: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాండూర్ యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ సమీపంలో కల్వర్టు గుంతలో పడి కానిస్టేబుల్ మృతిచెందారు. భద్రప్ప జాతర ఉత్సవాల విధులకు హాజరై తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని సమాచారం. మృతుడు బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్‌కు చెందిన నర్సింహాలు. ఆయన యాలాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. భద్రప్ప జాతర ఉత్సవాల విధుల్లో భాగంగా డ్యూటీ చేసి, రాత్రి సమయంలో తన స్వగ్రామం వైపు బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సమాచారం అందిన వెంటనే యాలాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కానిస్టేబుల్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విధుల నుంచి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీరాముని విగ్రహానికి స్వస్తి.. కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం
కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి
Read Latest Telangana News And Telugu News