సబ్‌స్టేషన్లలో పాలీహౌస్‌లు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:24 AM
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరాతో విద్యుత్ శాఖపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల దిశగా రైతులను ప్రోత్సహించేలా విద్యుత్ శాఖ అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
సోలార్ విద్యుత్‌తో కూరగాయల సాగు
కరెంటు వాడకం తగ్గించేందుకు విద్యుత్ శాఖ వినూత్న యత్నం
240 గజాల స్థలంలోనే ఏర్పాటు
పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా చించోడ్‌లో..
విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు
షాద్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరాతో విద్యుత్ శాఖపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల దిశగా రైతులను ప్రోత్సహించేలా విద్యుత్ శాఖ అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా కూరగాయలు, ఆరుతడి పంటల సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తక్కువ పెట్టుబడితో.. అతితక్కువ భూ విస్తీర్ణంలో పాలీహౌస్ ఏర్పాటు చేసి.. దానికి సోలార్ విద్యుత్‌ను వినియోగించడం ద్వారా ఎక్కువ రాబడి పొందే విధానాన్ని రైతులకు పరిచయం చేయనున్నారు. ఇందుకోసం తొలుత విద్యుత్ సబ్‌స్టేషన్లలోని ఖాళీ స్థలాల్లోనే వీటిని ఏర్పాటు చేసి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోనే కూరగాయల సాగు చేపట్టనున్నారు.
కేవలం 240 చదరపు గజాల స్థలంలోనే పాలీహౌస్ ఏర్పాటుతో కూరగాయల సాగు చేసి నెలకు రూ.50 వేల దాకా ఆదాయం పొందవచ్చని నిరూపించనున్నారు. ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎంపిక చేశారు. ఇక్కడ విజయవంతమయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇటీవల విద్యుత్ శాఖ సీఎండీ.. షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్ మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిష్ణాతులైన వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను ఏఈలకు ఇవ్వనున్నారు. ఈ ప్రయోగంపై వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసేందుకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, ఈ నెలలోనే అందుబాటులోకి తేవాలన్న ఆలోచనలో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటలు రైతులకు ఎంతో లాభదాయకమని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందనే విషయంపై విద్యుత్ శాఖ తరఫున రైతులకు అవగాహన కల్పించేందుకే విద్యుత్ సబ్ ప్టేషన్లలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని షాద్‌నగర్ డీఈ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు.
12 గంటల బోరుకే నెలకు 7500 ఖర్చు
ప్రస్తుతం వ్యవసాయానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ బోర్ల వినియోగం ద్వారా విద్యుత్ శాఖపై భారీగా భారం పడుతోంది. ఒక రైతు 12 గంటల పాటు సింగిల్ ఫేజ్‌పై బోర్ మోటార్‌ను నడిపితే విద్యుత్ బిల్లు నెలకు రూ.3500 అవుతుంది. అదే బోరును 24 గంటలు నడిపితే నెలకు రూ.7 వేల విద్యుత్ ఖర్చవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వ్యవసాయ బోర్లను వినియోగిస్తుండటం వల్ల విద్యుత్ శాఖపై రూ.వేల కోట్ల భారం పడుతోంది. ఓవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడం, మరోవైపు విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ విధానం వల్ల విద్యుత్ శాఖపై భారాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News