పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:09 AM
పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు.
వికారాబాద్, మార్చి 2: పీఏసీ సభ్యులతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని తెలిపారు. మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు.
మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-అమెరికన్ ట్రేడ్ డీల్‌తో ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ.. ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టాలని పార్టీ సీనియర్ నేత వీహెచ్ కోరగా.. అందుకు రాహుల్ సమ్మతి తెలిపారు.
ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్, వైఎస్ షర్మిల తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్.. ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి అనంతగిరి హరితా రిసార్ట్స్‌కు బయలుదేరారు. అక్కడ జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో రాహుల్, సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి...
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌కు రాహుల్.. ఎయిర్‌పోర్టులో సాదర స్వాగతం
Read Latest Telangana News And Telugu News