వినాయక విగ్రహం కొనుగోలులో ఘర్షణ.. వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 14 , 2026 | 10:20 AM
వినాయక విగ్రహ కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మేడ్చల్-మల్కాజిగిరి, సెప్టెంబర్ 14: వినాయక విగ్రహ కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చౌదరిగూడ ప్రాంతానికి చెందిన కొందరు వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్లకు వెళ్లారు. అక్కడ విగ్రహాలు విక్రయిస్తున్న వారితో ధర, కొనుగోలు విషయంలో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో చౌదరిగూడకు చెందిన కిరణ్(34) అనే వ్యక్తిపై విక్రయదారుల్లో కొందరు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందాడు.
ఈ ఘటనలో విగ్రహాలు విక్రయిస్తున్న రాజస్థాన్‌కు చెందిన చోగారామ్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కిరణ్ మృతితో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు.. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News