నేడు అనంతగిరికి రాహుల్
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:57 AM
ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ.....
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి హాజరు
పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం
డీసీసీ అధ్యక్షులు, కుటుంబ సభ్యులతో ముఖాముఖి
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీతోనూ భేటీ
హైదరాబాద్/వికారాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎయిరిండియా విమానంలో ఉదయం 9.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్.. అక్కడి నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో అనంతగిరికి వెళతారు. అక్కడ తొలుత టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. దీంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా రాహుల్ ముఖాముఖి మాట్లాడనున్నట్లు, వారితో కలిసి ఫొటోలు దిగనున్నట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం ఉదయం 8 గంటలలోగా డీసీసీ అధ్యక్షులు తమ కుటుంబ సభ్యులను శిక్షణ శిబిరం వద్ద అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకుల నుంచి సమాచారం అందింది.
రాజ్యసభ స్థానాలపై నిర్ణయం!
అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీల రాజకీయ వ్యవహారాల కమిటీల (పీఏసీ)లతో రాహుల్‌గాంధీ వేర్వేరుగా సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద ని తెలుస్తోంది. అయితే పీఏసీతో భేటీలో ఈ అంశంపై చర్చ ఉండదని, అది కేవలం ఫొటో సెషన్‌గా మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సాయంత్రం 4.30 గంటలకు రాహుల్ అక్కడి నుంచి బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళతారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌గాంధీ వికారాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలంతా అనంతగిరి బాట పట్టారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం మధ్యాహ్నమే అనంతగిరి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీడబ్ల్యుసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, సంఘటన్ సృజన్ అభియాన్ చైర్మన్ సచిన్‌రావు తదితరులు హరిత రిసార్ట్స్‌లో రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాహుల్‌తోపాటు సీఎం రేవంత్ కూడా వస్తుండడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
నాగార్జున సాగర్‌కు ఖర్గే..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ద పూర్ణిమను సందర్శించనున్నారు. అక్కడ బౌద్ద భిక్షువులకు సంబంధించి జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఖర్గే.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాగర్‌కు వెళతారు.
మా పెద్దబ్బాయి పెళ్లికి రండి
సీఎం రేవంత్ కుటుంబాన్ని ఆహ్వానించిన భట్టి
‘మా పెద్దబ్బాయి పెళ్లికి రండి’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబం ఆహ్వానించింది. మార్చి 5న హైదరాబాద్‌లో భట్టి కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహం జరగనున్న నేపథ్యంలో ఆదివారం డిప్యూటీ సీఎం తన భార్య నందినితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్, ఆయన భార్య గీతకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.