ఉపాధి కోసం వెళ్లి..మృత్యువుతో పోరాటం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:13 AM
సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం జరిగిన క్షిపణి దాడిలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన షేక్ సయీద్ (36) తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడిలో కామారెడ్డి వాసికి తీవ్రగాయాలు
నిజామాబాద్/కామారెడ్డి/బాన్సువాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం జరిగిన క్షిపణి దాడిలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన షేక్ సయీద్ (36) తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. రియాద్‌లోని కింగ్ ఫహద్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డిలోని సైలాన్‌బాబా కాలనీకి చెందిన సయీద్ 12 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. కొన్నేళ్లుగా రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్టార్‌బక్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. హూతీలు జరిపిన ఈ క్షిపణి దాడిలో 13 మందికి పైగా మృతి చెందగా, సుమారు 300 మంది ఉద్యోగులు గాయపడినట్లు సమాచారం. సయీద్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్‌కు చెందిన యూసఫ్ అలీ మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు గాయపడిన విషయం తెలిసిందే.
రష్యాలో బాన్సువాడకు చెందిన అఫ్జల్‌ఖాన్ మృతి?
రష్యా సైన్యంలో చిక్కుకుని బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్‌ఖాన్ (43) అనే వ్యక్తి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన ఆయన పది రోజుల క్రితమే మరణించినట్లు సమాచారం. అఫ్జల్‌ఖాన్‌తో పాటు సైన్యంలో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లా పెద్ద వాల్గోట్ గ్రామానికి చెందిన సిర్సు అశోక్ తన భార్యకు పంపిన సందేశం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘డ్రోన్ వచ్చి ఢీకొట్టడంతో అఫ్జల్‌ఖాన్ చచ్చిపోయిండు.. నాకూ గాయాలయ్యాయి. రాత్రింబవళ్లు పదిరోజులు నడిచినం.. ఒక దగ్గర పట్టుబడినం.. నాతో 50 మంది వస్తే అందరూ ఖల్లాస్ అయిండ్లు.. ఇద్దరమే మిగిలినం’’ అని వాయిస్ మెసేజ్‌లో అశోక్ ఆవేదనను వినిపించారు. ఇదే విషయాన్ని అఫ్జల్‌ఖాన్ తమ్ముడు అంజద్‌ఖాన్ కూడా తెలిపారు. అయితే దీన్ని రష్యా ప్రభు త్వం గానీ, భారత ఎంబసీ గానీ అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. అఫ్జల్‌ఖాన్ మృతిని అధికారికంగా నిర్ధారించి, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాంగ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
సుదర్శన్ గౌడ్ కుటుంబానికి సీఎం రూ. 6 లక్షల ఆర్థిక సాయం
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో గతనెల 1న ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ. 6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉపాధి కోసం 4 నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International