నిరుద్యోగ నిధుల భక్షణ?
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:06 AM
ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపాల్సిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిధులను ఓ ఐఏఎస్ అధికారి, ఓ దళారీ తమ జేబుల్లోకి మళ్లించుకునేందుకు ప్రణాళికలు రచించారు.
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో శిక్షణ పేరిట
రూ.112 కోట్ల కుంభకోణానికి మాస్టర్ ప్లాన్
నామినేషన్ పద్ధతిలో ఢిల్లీకి చెందిన సంస్థలకు
శిక్షణ బాధ్యతలు.. 50 శాతం నిధుల స్వాహాకు కుట్ర
శిక్షణ ప్రారంభం కాకపోయినా మొబిలైజేషన్
అడ్వాన్స్‌ల పేరిట రూ.44.58 కోట్ల చెల్లింపులు
ఓ దళారీతో కలిసి సీనియర్ ఐఏఎస్ నిర్వాకం
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపాల్సిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిధులను ఓ ఐఏఎస్ అధికారి, ఓ దళారీ తమ జేబుల్లోకి మళ్లించుకునేందుకు ప్రణాళికలు రచించారు. ఢిల్లీ కేంద్రంగా నడిచే సంస్థలకు ఏకంగా రూ.112 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు పథకం పన్నారు. ఆయా సంస్థల నుంచి 50 శాతం కమీషన్లు దండుకునేందుకు ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘నామినేషన్’ పద్ధతిలో శిక్షణ బాధ్యతలు అప్పగించడమే కాదు.. అడ్వాన్స్‌ల రూపేణా రూ.44.58 కోట్లు చెల్లించడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. గురుకులాలు, హాస్టళ్లకు నిత్యావసరాల సరఫరా టెండర్లలో కోట్లాది రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన సీనియర్ ఐఏఎస్ అధికారే.. ఈ కుంభకోణం వెనుక ఉన్నారనే చర్చ సాగుతోంది. ఇందుకోసం సదరు ఐఏఎస్ అఽధికారి తన సొంత సామాజిక వర్గానికి చెందిన, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంధువును మధ్యవర్తిగా రంగంలోకి దించినట్లు తెలిసింది. గతంలో ఒక శిక్షణ కేంద్రాన్ని నడిపిన అనుభవం ఉన్న ఆ దళారీ.. ఈ దోపిడీ స్కెచ్‌కు మాస్టర్ మైండ్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం.
రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ యువతకు ఉపాధి కల్పించేందుకు, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన(పీఎం-ఏజేఏవై) కింద నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు (స్కిల్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్స్) నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్, డిగ్రీ, బీటెక్.. ఆపై ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువత భవిత పోర్టర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేసి మూడు నెలలు శిక్షణ ఇవ్వడమే కాకుండా వసతి కల్పిస్తారు. ఇందుకోసం ఒకొక్కరికి రూ.75వేల చొప్పున ఆయా శిక్షణ సంస్థలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. నిబంధనల ప్రకారం.. టెండర్ నిర్వహించి శిక్షణ సంస్థలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, శిక్షణ కార్యక్రమాలను సొమ్ము చేసుకోవాలని భావించిన సీనియర్ ఐఏఎస్.. టెండర్ విధానాన్ని తుంగలో తొక్కారు.
నామినేషన్ పద్ధతిలో ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ (టీహెచ్‌ఎస్సీ), అపారెల్ మేడ్- యూపీఎస్ అండ్ హోమ్ ఫర్నీషింగ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ఏపీహెచ్‌ఎస్ఎస్‌సీ), అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ), బ్యూటీ అండ్ వెల్‌నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (బీడబ్ల్యూఎస్ఎస్‌సీ), ఏఎఫ్‌సీ ఇండియా లిమిటెడ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎన్‌ఐ-ఎంఎస్ఎంఈ)కు శిక్షణ బాధ్యతలు అప్పగించారు. వీటిలో ఏడింటికి తెలంగాణలో ఒక్క కార్యాలయం గానీ, శిక్షణ అందించే వ్యవస్థ గానీ లేదు. నామినేషన్ పద్ధతిలో ఎంపికైన ఆ సంస్థలు కూడా.. 10శాతం కమీషన్ తీసుకుని పక్కకు తప్పుకొనేలా సదరు ఐఏఎస్ బంధువుతోనే ముందస్తు అంగీకారం కుదుర్చుకున్నాయి.
ఢిల్లీ సంస్థలకు, ఐఏఎస్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి గతంలో ఒక శిక్షణ కేంద్రం ఉన్నా.. అదీ బ్లాక్‌లిస్టులోనే పడింది. రాష్ట్రంలోని పలు సంస్థలకు 40శాతం నిధులు విధిలించి, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేలా ఆయన బేరసారాలు సాగించారు. అంటే.. ఏకంగా 50శాతం నిధులను సదరు సీనియర్ ఐఏఎస్, ఆయన బంధువైన దళారీ కలిసి పంచుకునే ఒప్పందంతో ఈ కథంతా నడిచింది. అంత తక్కువ మొత్తానికి శిక్షణ అందించలేమని కొన్ని శిక్షణ కేంద్రాల నిర్వాహకులు నిరాకరించారు. దళారీ ద్వారా సబ్ కాంట్రాక్టు తీసుకున్న కొన్ని శిక్షణ సంస్థలు.. ఫేక్ హాజరుతో కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
అడ్వాన్స్‌గా 50శాతం చెల్లింపులు
రెండు మూడేళ్ల క్రితం శిక్షణ ఇచ్చిన సంస్థలు ఇప్పటికీ బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా.. అసలు శిక్షణే ఇవ్వని ఢిల్లీ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించడం విస్మయానికి గురి చేస్తోంది. శిక్షణ ప్రారంభమైన తర్వాత విడతల వారీగా నిధులు చెల్లించాల్సి ఉండగా, మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా 50శాతం నిధులు ఇచ్చేశారు. ట్రైకార్ ఆధ్వర్యంలో 9వేల మంది ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో రూ.54.37 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ఖరారు చేశారు. ఇందులో రూ.27.19కోట్లను అడ్వాన్సుల రూపంలో ఇచ్చేశారు.
మరోవైపు.. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 5వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు రూ.58కోట్లు కేటాయించగా.. ఇప్పటికే రూ.17.39 కోట్లు విడుదల చేశారు. కాగా, ట్రైకార్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ అందించేందుకు మరో రూ.75కోట్లు కావాలని దస్త్రం ముందుకు కదిలినట్లు తెలిసింది. ఆ ఫైల్‌కు మోక్షం కలిగితే.. నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టేందుకు సదరు ఐఏఎస్, దళారీ చక్రం తిప్పుతున్నట్లు సంక్షేమశాఖల అధికార వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. మూడేళ్ల క్రితం నాటి పెండింగ్ బిల్లుల్లో ఇటీవల 20 కోట్లు మంజూరు కాగా.. ఐఏఎస్ బంధువైన దళారీకి 12 శాతం అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నట్లు కొన్ని శిక్షణ సంస్థల నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా, ఐఏఎస్ అధికారి అక్రమాలు బయటకు వస్తుండడంతో లీక్‌లు ఇచ్చే అధికారులపై కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో అక్రమాలు వెలుగులోకి వస్తుండడంతో నిఘావర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సదరు ఐఏఎస్, దళారీల దందా.. బట్టబయలు కానుందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International