Share News

రోగుల భద్రతకు భరోసా!

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:01 AM

వైద్యసేవల పరంగా గానీ, ఆస్పత్రి ఖర్చుల పరంగా గానీ రోగులకు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. మరి.. అడ్మిట్‌ అయినప్పటి నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి బయటకు అడుగుపెట్టేదాకా రోగి భద్రతకు పెద్దపీట వేస్తూ ...

రోగుల భద్రతకు భరోసా!
National Medical Commission

  • ఆస్పత్రుల్లో పేషెంట్‌ సేఫ్టీ కమిటీలు!..

  • వైద్య సేవల్లో పొరపాట్లకు చెక్‌..

  • 11 విభాగాల్లో పర్యవేక్షణ

  • ప్రతి మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిలో ప్రత్యేక సెల్‌

  • నోడల్‌ ఆఫీసర్ల నియామకం తప్పనిసరి

  • ప్రమాదకర ఘటనలపై విశ్లేషణ, దిద్దుబాటు చర్యలు

  • ఆదేశాలు జారీ చేసిన జాతీయ వైద్య కమిషన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): వైద్యసేవల పరంగా గానీ, ఆస్పత్రి ఖర్చుల పరంగా గానీ రోగులకు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. మరి.. అడ్మిట్‌ అయినప్పటి నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి బయటకు అడుగుపెట్టేదాకా రోగి భద్రతకు పెద్దపీట వేస్తూ అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక విభాగం ఉంటే? ఈ దిశగానే జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య సేవల్లో చోటుచేసుకునే పొరపాట్లు, మందుల వినియోగంలో నిర్లక్ష్యం, శస్త్రచికిత్సల్లో సమస్యలు, రక్తమార్పిడి సమయంలో తలెత్తే ప్రమాదాలు, ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి వంటి అంశాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని మెడికల్‌ కాలేజీలు, వైద్య సంస్థల్లో పేషెంట్‌ సేఫ్టీ కమిటీ-సెల్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.


ప్రతి వైద్య కళాశాల, ఆస్పత్రికి ఒక పేషెంట్‌ సేఫ్టీ నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఎన్‌ఎంసీ పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఆస్పత్రుల్లో రోగులకు సురక్షితమైన వైద్య సేవలు అందించడం, నివారించదగిన వైద్యపరమైన పొరపాట్లను తగ్గ్గించడం, చికిత్సకు సంబంధించి అనవసర ఖర్చులను నియంత్రించడం, రోగుల సంతృప్తిని పెంచడం, వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యాలు. అన్ని మెడికల్‌ కాలేజీలు, వైద్య సంస్థలు తమ పేషెంట్‌ సేఫ్టీ కమిటీల కూర్పు, నోడల్‌ ఆఫీసర్‌ పేరు, వివరాలను నేషనల్‌ పేషెంట్‌ సేఫ్టీ సెక్రటేరియట్‌కు పంపాలని ఎన్‌ఎంసీ కోరింది. ఇందుకోసం secretariatpatientsafety@gmail.com మెయిల్‌కు వివరాలు పంపాల్సి ఉంటుంది. పేషెంట్‌ సేఫ్టీ కోసం మొత్తం 11 విభాగాలను గుర్తించారు. ఆయా విభాగాలకు సంబంధించి సంబంధిత వైద్య నిపుణులు, అధ్యాపకులతో కమిటీకి ప్రాతినిధ్యం కల్పించనున్నారు.


నోడల్‌ ఆఫీసర్‌దే కీలక బాధ్యత

ప్రతి మెడికల్‌ కాలేజీ, వైద్య సంస్థలో పేషెంట్‌ సేఫ్టీ నోడల్‌ ఆఫీసర్‌ను తప్పనిసరిగా నియమించాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. మెడికల్‌ సూపరింటెండెంట్‌ లేదా అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారిని నియమించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. పేషెంట్‌ సేఫ్టీ సెల్‌లో సంస్థ అధిపతి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ లేదా డైరెక్టర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. నియమిత నోడల్‌ ఆఫీసర్‌ మెంబర్‌ సెక్రటరీగా ఉంటారు. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ లేదా నర్సింగ్‌ ప్రతినిధి, క్వాలిటీ మేనేజర్‌ లేదా ఎన్‌ఏబీహెచ్‌ కోఆర్డినేటర్‌తో పాటు అవసరమైన ఇతరసభ్యులు కమిటీలో ఉంటారు. వీరితోపాటు 11విభాగాలకు ఆయా ప్రత్యేక వైద్య విభాగాల నుంచి ఫ్యాకల్టీ ప్రతినిధులను నియమించాలి.


వైద్యపరమైన పొరపాట్లపై మూలాల అన్వేషణ

రోగులకు చికిత్స అందించే క్రమంలో ఏదైనా భద్రతాపరమైన లోపం జరిగితే సంబంధిత వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ పొరపాటు జరగడానికి దారితీసిన వ్యవస్థాగత లోపాలను ప్రత్యేక సెల్‌ గుర్తించాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు సూచించాలి. రోగుల భద్రతకు సంబంధించిన వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. సేఫ్టీ కమిటీలు నెలకోసారి అయినా, మూడు నెలలకోసారైనా సమావేశమవ్వాలి. నివేదికలను సంస్థ అధిపతితోపాటు నేషనల్‌ పేషెంట్‌ సేఫ్టీ సెక్రటేరియట్‌కు పంపాలి. ఆస్పత్రుల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌, మెడికేషన్‌ సేఫ్టీ, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ సేఫ్టీ, బయోమెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ సేఫ్టీ, క్వాలిటీ అష్యూరెన్స్‌ తదితర కమిటీల కార్యకలాపాలను పేషెంట్‌ సేఫ్టీ సెల్‌తో సమన్వయం చేస్తూ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో స్వాతంత్య్ర పోరాటం

పప్పులు.. నూనెగింజలు.. కూరగాయలు

కోతకు ముందే కొనుగోలు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 05:01 AM