Share News

ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:26 PM

వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న వరికి బదులు ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటల వైపు వెళ్లాలని వారికి స్పష్టం చేశారు.

ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం: మంత్రి తుమ్మల
TG Minister Thummala Nageswara rao

కామారెడ్డి, జూన్16: రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంత్రి మాట్లాడుతూ.. క్యూ లైన్లు అవసరం లేకుండా ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని రైతులకు కల్పిస్తామన్నారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఇప్పటికే 4.06 లక్షల మంది రైతులు బుకింగ్ చేసుకున్నారని వివరించారు. మొత్తం13.22 లక్షల యూరియా బస్తాల బుకింగ్ చేసుకుంటే.. 84.6 శాతం పంపిణీ పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 90.22 లక్షల యూరియా బస్తాల భారీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల సూచనలతో ఫర్టిలైజర్ యాప్‌లో నిరంతర మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.


స్మార్ట్‌ ఫోన్ లేని రైతులకు టోల్ ఫ్రీ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ యాప్ వినియోగంలో నిజామాబాద్ జిల్లా రైతులు రాష్ట్రంలో ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్, అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకే ఈ డిజిటల్ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు వివరించారు. నిజమైన రైతులకు మాత్రమే ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.


అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఉన్నా యూరియా కొరత రానివ్వమని రైతులకు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల భరోసా కల్పించారు. పెద్దరైతులు ఆందోళన చెంద వద్దని.. అందరికీ సమానంగా ఎరువుల పంపిణీ చేస్తామన్నారు. అధిక యూరియా వినియోగం భూసారానికి హానికరం అని రైతులను ఆయన హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రైతులకు స్పష్టం చేశారు.


వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలంటూ రైతులకు మంత్రి తుమ్మల సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న వరికి బదులు ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటల వైపు వెళ్లాలని రైతులకు స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతాంగానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాకు సీఎం రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్‌ అవసరం లేదు: కిషన్ రెడ్డి

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 07:37 PM