Share News

నాకు సీఎం రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్‌ అవసరం లేదు: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:44 PM

తెలంగాణ అభివృద్ధిపై తమకు చిత్తశుద్ధి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో అంశంలో బీజేపీపై బురదజల్లుతున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

నాకు సీఎం రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్‌ అవసరం లేదు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్16: తెలంగాణ అభివృద్ధిపై తమకు చిత్తశుద్ధి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో అంశంలో బీజేపీపై బురదజల్లుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-1కు కేంద్రం రూ.1250 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. దేశంలో మెట్రో రైలు ఫేజ్-2, 3లకు కేంద్రం ఎలా సహకరిస్తోందో.. హైదరాబాద్‌కూ అలాగే సహకారమందిస్తోందని చెప్పారు.


మెట్రో రైలు ప్రాజెక్ట్ ఆపాలని తానేందుకు చెబుతానంటూ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి. 'నేను వద్దంటే ఎక్కడా ప్రాజెక్టులు ఆగవు. నేనెప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేశాను. తెలంగాణలో కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఒక లక్షా 75 వేల కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి మా బాధ్యత' అని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.


తనపై సీఎం రేవంత్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అనాలోచితంగా మాట్లాడుతున్నారన్న ఆయన.. తమకు రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్‌ ఏమీ అవసరం లేదన్నారు. అభివృద్ధి అంశంలో తమకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలకు సూచించారు. తాను సీఎం రేవంత్‌కు కాదని.. ప్రజలకు జవాబుదారీని అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను పోరాటం చేశానని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీలో రెండుసార్లు ధర్నా చేశానన్నారు. బిల్లు ఆమోదం పొందాకే ఆమరణ దీక్షను విరమించానని వివరించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నాడు కేసీఆర్‌.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలు రాశానని తెలిపారు. రేవంత్‌ కోరితేనే తాను అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.


మెట్రో విస్తరణ కోసం చురుగ్గా పనిచేయాలని.. గతంలోనే సీఎం రేవంత్‌కు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. రేవంత్‌ అనుకుంటేనో.. తాను అడ్డుకుంటేనో ప్రాజెక్టులు ఆగవని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అలా చేస్తుందేమో.. కానీ బీజేపీ అలా కాదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.. ఈగల్ ఫోర్స్ అదుపులో 19 మంది

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 05:30 PM