కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:20 AM
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూలర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 17: ఎల్లారెడ్డి మండలం హజీపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోని కూలర్‌ను రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రాజిరెడ్డి(47) అనే వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రతీ ఒక్కరూ ఏసీ, కూలర్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో రాజిరెడ్డి కూడా తన ఇంట్లో ఉన్న కూలర్‌ను సరి చేసేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై రాజిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే రాజిరెడ్డి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రాజిరెడ్డి.. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజిరెడ్డి మృతితో భార్య, కుమార్తెలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన
Read Latest Telangana News And Telugu News