Suryapet Road Accident: పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు టీచర్లు మృతి
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:54 AM
సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఐదుగురు టీచర్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది.
సూర్యాపేట, జనవరి 17: అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Suryapet Road Accident) జరిగింది. ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులున్న కారు.. స్కూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సంక్రాంతి సెలవుల అనంతరం.. శనివారం స్కూళ్లు తెరుచుకోవడంతో రోజువారీ విధుల్లో భాగంగా నల్గొండ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ప్రభుత్వ పాఠశాలకు కారులో బయలుదేరారు. అయితే.. అర్వపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయుల్లో కస్తూర్బా గాంధీ ఏఎస్‌వో కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. హెడ్‌మాస్టర్ గీత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు.
గాయపడిన మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రస్తుతం.. సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
Hyderabad: ‘చేయి’ విడిచి కారెక్కుదామా...
Read Latest Telangana News And Telugu News