Share News

భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా?: సీఎం రేవంత్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:16 PM

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు.

భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా?: సీఎం రేవంత్‌

నల్గొండ, ఫిబ్రవరి 04: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తి ఎదుట ఎవరూ నిలువలేరన్నారు. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. గతంలో ఒక్క కొత్త రేషన్‌ కార్డయినా ఇచ్చారా? అంటూ గత ప్రభుత్వాన్ని రేవంత్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.


3.15 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే వరికి రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరే అని కేసీఆర్‌ అన్నారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రైతులకు రూ.21వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ వివరించారు.


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఆడబిడ్డలంతా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు సైతం రావన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చూసి ఓటు వేయాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. రెండేళ్లలో పేదలు, గిరిజనుల సంక్షేమం కోసం ఎంతో చేశామని చెప్పుకొచ్చారు. గతంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు కానీ.. పేదలను పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ఎండగట్టారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున.. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.


బీఆర్ఎస్ హయాంలో ఎస్‌ఎల్‌బీసీని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కానీ తాము ఈ ఎస్‌ఎల్‌బీసీ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మామ, అల్లుడు, బామ్మర్ది కలిసి నల్గొండ జిల్లాపై విషం చిమ్మారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. గంజికి గతిలేనోళ్లు కూడా బెంజి కార్లు కొన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. సినిమా తారల ఫోన్లు సైతం విన్నారని తెలిపారు. జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కేడర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు జాతిపిత.. మీ జాతి ఏంటి?.. నీతి ఏంటి? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలపై నిప్పులు చెరిగారు. దోపిడీ చేసిన దొంగలు జాతిపిత ఎలా అవుతారు? అంటూ వారిని సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు. వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్న మీలాంటోళ్లని.. జాతిపిత అంటే.. ఆత్మహత్య చేసుకుని చావాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.


తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినోళ్లు జాతిపిత అవుతారని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని నేలకు ముక్కు రాయండంటూ వారికి స్పష్టం చేశారు. రెండేళ్లే పూర్తయ్యాయి.. మరో 8 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిరంతర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌నే గెలిపించాలని ప్రజలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ చీఫ్ నితిన్ నబిన్

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా

13 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 06:57 PM