మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ చీఫ్ నితిన్ నబిన్
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:26 PM
మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 04: తెలంగాణలో రాజకీయాలు చాలా దయనీయంగా ఉన్నాయని.. మనదేశ సంస్కృతి సంప్రదాయాలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా విమర్శించారు. బుధవారం నాడు మహబూబ్ నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నితిన్ నబీన్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ నిధులను మైనార్టీలకు బదలాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉందని గుర్తు చేశారు. ముస్లింల ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు నితిన్ నబీన్.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలను కూల్చారంటూ మండిపడ్డారు నితిన్ నబీన్. ఆలయాలపై రాజకీయం చేస్తే.. బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. అవసరమైతే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే.. ఎక్కువ రోజులు ఉండబోదంటూ హెచ్చరించారు. ప్రధాని మోదీ.. మహిళలను లక్షాధికారులను చేయాలని చూస్తే.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు నితిన్ నబీన్ సూచించారు.
ఏ ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని.. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలోనే కాదు.. బీఆర్ఎస్ పాలనలో సైతం పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయని.. చేతలు మాత్రం గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ ఒక్కరి మీద చర్య తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
కేసీఆర్, రాహుల్ గాంధీ మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్రమంత్రి ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి పౌరహక్కులు కాలరాసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యాలయంలో క్లర్క్ ఫోన్ సైతం ట్యాపింగ్ చేశారంటూ విమర్శించారు. సిట్ నోటీసులు టీవీ సీరియల్‌ను తలపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీని చూసి భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: టీ బీజేపీ చీఫ్
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయ దురహంకారం పెరిగిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్ రాంచందర్ రావు మండిపడ్డారు. బీజేపీని చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే మాత్రం ట్యాక్స్‌లు పెరుగుతాయని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మాత్రం.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తీరాలని కేడర్‌కు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి.. బీజేపీ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం చేశారు.
Also Read:
మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా
13 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్
హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు