అమెరికాతో ఒప్పందం వద్దు
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:09 AM
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం (మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కార్యాచరణపై) ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు.
రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ
12 ఏళ్ల పాలనలో 5 లక్షల మంది రైతుల ఆత్మహత్యలు
వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధానాలు
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్
నల్లగొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహా సభలు
నల్లగొండ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం (మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కార్యాచరణపై) ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు బహిరంగ సభలో బృందాకారత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయ రంగాన్ని దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను మోదీ సర్కార్ దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు. గత పన్నెండేళ్ల పాలనలో 5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడిదారీ విధానాలే కారణమన్నారు. విత్తనాలు, ఎరువులు, చివరకు పంటల విక్రయాల కోసం కూడా రైతులు పోరాడాల్సి వస్తోందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సంక్షోభంతో చిన్న, సన్నకారు రైతులు భూములు అమ్ముకొని కూలీలుగా మారుతున్నారని, ఆదివాసీల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీలో రైతాంగం ఐక్యంగా పోరాడి నల్లచట్టాలను తిప్పికొట్టిన స్ఫూర్తితో మరోసారి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమేందుకు ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఖండించారు. కులమతాలకు అతీతంగా సాగిన లౌకిక పోరాటాన్ని వక్రీకరించొద్దని హెచ్చరించారు.
రూ.50 వేల కోట్ల కరువు పరిహారం ప్రకటించాలి
రాజ్యాధికారంతోనే రైతాంగ హక్కులు పరిరక్షించవచ్చని, ఆ దిశగా రైతు ఉద్యమ నాయకులు కృషి చేయాలని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్‌ధావ్లే పిలుపునిచ్చారు. కేరళ, బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాల హయాంలో పేదలకు భూములు పంపిణీ చేశారని.. తెలంగాణలోనూ సాయుధ పోరాటం ద్వారా 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని గుర్తు చేశారు. రైతాంగ భవిష్యత్ పోరాటాలకు ఈ మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు, కరువు నివారణకు కేంద్రం రూ.50 వేల కోట్ల పరిహారం ప్రకటించాలని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శనరావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. కరువు సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, ఏడుగురు ఎంపీలు కరువు సాయం కోసం కృషి చేయాలని కోరారు. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తీగల సాగర్, రైతు సంఘం నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహాసభలో మాట్లాడారు. ఏఐకేఎస్ మహా సభల సందర్భంగా నల్లగొండ ఎర్రజెండాలతో రెపరెపలాడింది. మర్రిగూడ బైపాస్ నుంచి ఎన్జీ కళాశాల వరకు నాలుగు కిలోమీటర్ల మేర రెండు గంటలకు పైగా సాగిన భారీ ప్రదర్శన రైతాంగ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని చాటిచెప్పింది. సంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News