బీజేపీ తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్
ABN , Publish Date - Jun 16 , 2026 | 06:26 PM
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్‌పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
సంగారెడ్డి, జూన్16: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాంటి దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బీజేపీకి తొత్తుగా మారిందని ఆరోపించారు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని.. కానీ ప్రస్తుతం వారికి ఓట్లు పడవనుకుంటే వాటిని తొలగిస్తుందన్నారు. మతతత్వ పార్టీలకు ప్రయోజనం చేకూరేలా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ నిర్వహించే కుట్ర జరుగుతుందని విమర్శించారు. మంగళవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్‌పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ పేరుతో 92 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని వివరించారు.
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితోపాటు తన ఓటు గల్లంతు అయినా ఆశ్చర్య పోనక్కర్లేదని మహేశ్ కుమార్ గౌడ్ వ్యంగ్యంగా అన్నారు. తమ ఓట్లు క్షేమంగా ఉండాలంటే బీఎల్‌ఏ కీలకంగా పని చేయాల్సి ఉందని చెప్పారు. రాజకీయాల్లో తనకు దామోదర రాజనర్సింహ ఓనమాలు నేర్పించారని గుర్తు చేసుకున్నారు. ఈ దేశంలో అతికొద్దిమంది నిజాయితీపరుల్లో మీనాక్షి నటరాజన్ ఒకరని పేర్కొన్నారు. ఆ కారణంతోనే ఆమె రాజ్యసభ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారని తెలిపారు. బీజేపీ వాళ్లకి కనికరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరంతరం అధికారంలో ఉండి చక్రవర్తుల్లా ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మీ కంటే పెద్ద చక్రవర్తులే నేలమట్టం అయ్యారు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎంత..? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం అనుకుంటే.. వారు మూర్ఖులే అవుతారన్నారు. దేవుళ్లకు ఎవరు వ్యతిరేకం కాదని.. కానీ దేవుడి పేరు చెప్పనిదే బీజేపీ వాళ్లకు ఓట్లు పడవన్నారు.
ఏడాదిలో చాలాసార్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పూజలు నిర్వహిస్తారని.. కానీ దేవుళ్ల పేరుతో తాము ఓట్లు అడగమన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించి.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారంటూ కేంద్రంపై టీపీసీసీ చీఫ్ నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చీఫ్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.
మీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు: టీపీసీసీ చీఫ్
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని టీపీసీసీ చీఫ్ విమర్శించారు. కమలం పార్టీ ఆడించినట్టే.. ఆయన ఆడుతున్నారని ఆరోపించారు. మీ సానుభూతి తమకేం అవసరం లేదని పవన్‌కు స్పష్టం చేశారు. మీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని పవన్‌కు సూచించారు. తెలంగాణ వచ్చినప్పుడు 10 రోజులు అన్నం తినలేదని పవన్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ కౌంటర్
ఈ 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చిట్టా ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు. విభజన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సబర్మతిని కట్టుకోవచ్చు.. తాము మూసి ప్రక్షాళన చేస్తామంటే మాత్రం నిధులు ఇవ్వరని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. వీటికి సమాధానం చెప్పాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. ఓ వైపు బీజేపీ, మరో వైపు బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం: మంత్రి తుమ్మల
నాకు సీఎం రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News