ఏ ప్రభుత్వమైనా టైటిల్ మారింది తప్ప.. దోపిడీ విధానాలు మారలేదు: టీబీజేపీ చీఫ్
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:08 PM
భూములు కాపాడండంటూ పేద రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని టీ బీజేపీ చీఫ్ ఎన్.రాంచందర్ రావు తెలిపారు. 22 ఏ నిషేధిత జాబితాపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిద్ధిపేట, ఆగస్టు 31: భూమి వివరాల కోసం బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి కంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి ఇంకా దరిద్రంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. 22 ఏ తో దాదాపు 50 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22 ఏ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ మహాధర్నా నిర్వహించింది.
ఈ ధర్నాలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్థం లేని విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తప్పు జరిగిందని ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తప్పును మాత్రం సరిదిద్దుకోవడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు బీఆర్ ఎస్ అయినా.. నేడు కాంగ్రెస్ అయినా టైటిల్ మారింది తప్ప, దోపిడి విధానాలు మారలేదని వ్యంగ్యంగా అన్నారు.
403 సర్వే నెంబర్‌లో కేవలం రెండు ప్లాట్లు సమస్యల్లో ఉంటే వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని వివరించారు. అదే సర్వే నెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు మాత్రం 22 ఏ నుంచి బయటకు ఎలా వచ్చిందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమిషన్‌తో నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. పేదల భూములు గుంజుకుని ప్రభుత్వం అమ్ముకుంటున్నదని విమర్శించారు.
తమ భూములు కాపాడండంటూ పేద రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని చెప్పారు. 22 ఏ నిషేధిత జాబితాపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 22 ఏపై స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతుల కోసం బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. వారి కోసం జైలుకైనా వెళ్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే లోపు ప్రభుత్వం 22ఏ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ చీఫ్ రామచందర్ రావు సూచించారు.
22 ఏ జీవో తొలగించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం: ఎంపీ
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు, పేదలకు న్యాయం అన్నారని ఆ పార్టీ నేతలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కానీ ఇప్పుడు పేదలు, రైతుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పయింది సరి చేస్తామన్నారని చెప్పారని.. కానీ పేదలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు విక్రయిస్తేనే రాష్ట్రాభివృద్ధి అంటున్నారని రేవంత్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. భూమి విక్రయాలను గొప్పగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 22 ఏ రైతుల భూమి మీద పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు కష్టం వస్తే తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. భూభారతి తెస్తే రైతు కష్టం తీరుతుందని చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఇల్లు, రెవెన్యూ మంత్రి భూములు కూడా 22 ఏలో పడ్డాయని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తులు ఇప్పుడు ప్రజలకు చూపాలని డిమాండ్ చేశారు. గుంపు మేస్త్రి దరఖాస్తు బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. మీ భూములు ఏ దరఖాస్తులు లేకుండా 22 ఏలో నుంచి ఎలా తీసేస్తారని ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నించారు. మరి రైతుల భూములు ఎందుకు తియడం లేదని వారిని సందేహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో భూములు ఎవరికి తెలియకుండా మాయం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలువుల పేరిట, ప్రాజెక్టుల పేరిట భూములు లాక్కున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక్కడి భూములు విక్రయించి.. ఆ సూట్ కేసులు ఢిల్లీకి మోస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇంకో ఏడాది అయితే కాంగ్రెస్‌లో కార్యకర్తలు ఎవ్వరు ఉండరని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములు నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ లోగా 22 ఏ జీవో తొలగించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. నిందితుల అరెస్ట్
నీట్ పేపర్ లీక్ కేసు.. రంగంలోకి ఈడీ
For More TG News And Telugu News