Share News

సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా తెరకెక్కిస్తా: జగ్గారెడ్డి

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:39 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ ఆత్మకథ (బీ లాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్) ఆధారంగా తెలుగులో సినిమా తెరకెక్కిస్తానని తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. జగ్గారెడ్డి వెల్లడించారు.

సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా తెరకెక్కిస్తా: జగ్గారెడ్డి
TPCC Working President Jagga Reddy

సంగారెడ్డి, నవంబర్11: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ ఆత్మకథ (బీ లాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్) ఆధారంగా తెలుగులో సినిమా తెరకెక్కిస్తానని తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. జగ్గారెడ్డి వెల్లడించారు. అందుకు నగదు సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సోనియాగాంధీ జీవిత చరిత్రని సినిమాగా చూపించాలని పేర్కొన్నారు.


ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంక గాంధీలకు తల్లిగా ఆమె జీవితాన్ని సినిమాలో చూపిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. సోనియాగాంధీది ఓ విజయవంతమైన రాజకీయ జీవితమని ఆయన అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ సినిమాకి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ప్రొడ్యూసర్లని చెప్పారు. ఈ సినిమా కోసం ఓ కమిటీ వేసి.. ప్రక్రియను ప్రారంభిస్తానని పేర్కొన్నారు.


దేశంలో సోనియాగాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉందని జగ్గారెడ్డి తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాలను దగ్గరుండి చూశారని వివరించారు. సముద్రం ఎంత లోతో.. అంతటి రాజకీయ వ్యవస్థతో కాంగ్రెస్ పార్టీ కూడుకుని ఉందని చెప్పారు. సోనియాగాంధీకి ప్రధాని కుర్చీపై వ్యామోహం లేదని అన్నారు. భర్త రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఉన్న పీవీ నరసింహరావును ఆ పదవికి సోనియా గాంధీ ఎంపిక చేశారని గుర్తు చేశారు.


యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానిగా సోనియా గాంధీ ఉండాలని అందరూ కోరారని జగ్గారెడ్డి తెలిపారు. కానీ ఆమె మాత్రం డాక్టర్ మన్మోహన్ సింగ్‌ని ప్రధాన మంత్రిని చేశారని చెప్పారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న సోనియా గాంధీ వదులుకున్నారని.. అది ఓ చరిత్ర అని పేర్కొన్నారు. రాహుల్ ప్రధాని కావాలనేది సోనియా గాంధీ కోరిక అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత మాజీ ఉప రాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 07:00 PM