మెదక్ జిల్లాలో విషాదం.. తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 12 , 2026 | 10:56 AM
కుటుంబకలహాలు తల్లీకొడుకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్తతో గొడవపడిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా, తల్లి మరణవార్త విని కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్, సెప్టెంబర్ 12: జిల్లాలోని పెద్దశంకరంపేటలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మృతిని తట్టుకోలేని కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరణంలోనూ వీడని తల్లీకొడుకుల బంధం గ్రామస్థులను కంటతడిపెట్టిస్తోంది.
స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతమ్మ అనే మహిళ, ఆమె భర్త, కుమారుడు ప్రవీణ్(19)మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట మండలంలో మక్తా లక్ష్మాపూర్ గ్రామానికి చెందినవారు. బతుకుదెరువు నిమిత్తం బేతమ్మ ఆమె భర్తతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఆమె కుమారుడు ప్రవీణ్ మాత్రం గ్రామంలోనే ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తు్న్నాడు.
హైదరాబాద్‌లో బేతమ్మ, ఆమె భర్త స్థానికంగా ఏదో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, దంపతుల మధ్య తరచూ గొడవలయ్యేవి. నిన్న రాత్రి కూడా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో, మనస్తాపం చెందిన భార్య బేతమ్మ హైదరాబాద్‌లో తాముంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తల్లి మరణవార్త గ్రామంలో ఉన్న ప్రవీణ్‌కు తెలియగా.. తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు. తల్లి మరణాన్ని తట్టుకోలేక గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తల్లీకొడుకుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు, రేపు 4 జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు
హాలు బయటే కలెక్టర్ల సెల్‌ఫోన్లు
For More TG News And Telugu News