తెలంగాణలో మూడు వేల మంది రైతుల మృతి: హరీశ్ రావు
ABN , Publish Date - Oct 15 , 2026 | 02:58 PM
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ద్వారా లక్షా 28 వేల కుటుంబాలకు సాయం అందిందని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి బంద్ చేశారని మండిపడ్డారు.
సిద్దిపేట, అక్టోబర్15: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ద్వారా లక్షా 28 వేల కుటుంబాలకు సాయం అందిందని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి బంద్ చేశారని మండిపడ్డారు. రైతు బీమా పథకం బాగుందని.. కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని తాను పలుమార్లు కోరానని ఆయన వివరించారు. రాష్ట్రంలో మూడు వేల మంది రైతులు చనిపోయారని.. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 22 కుటుంబాలు రైతు బీమా లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
బీమా విషయంలో రైతులకు ఎలాంటి భరోసా ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. కొత్త బీమా పథకం వచ్చింది లేదు.. అవుతుందో లేదో తెలియదని పెదవి విరిచారు. అంతవరకు ఈ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన రైతు బీమా పథకాన్ని దేశం మొత్తం అభినందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రైతులకు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే.. ఇప్పుడు అయిదారు గంటలు కూడా రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ బాధ్యత ముఖ్యమంత్రిదని అన్నారు. కానీ విద్యుత్ కోతల విషయంలో ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తా అంటే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు.
మూడు నెలల నుంచి రైతు బీమా ఆగిపోయిందని.. ఆ విషయం మీకు తెలుసా? లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఈ రైతు కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేశారు. రైతు బీమా పథకాన్ని ఎందుకు బంద్ చేశారు.. కేసీఆర్కు పేరు వస్తుందనా? లేక రైతుల మీద మీకు ప్రేమ లేగనా? అంటూ సీఎం రేవంత్కు చురకలంటించారు.
వెంటనే ఈ బాధిత రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎల్ఐసీలో రైతు ప్రీమియం కట్టాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే బాధిత రైతు కుటుంబాలతో సీఎం ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు.
గురువారం సిద్దిపేటలో రైతు బీమా రాని కుటుంబాలతో ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు భరోసా కల్పించారు. ఈ సమావేశంలో తమ సమస్యలను ఎమ్మెల్యే హరీశ్ రావు దృష్టికి బాధిత కుటుంబాలు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు పై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళల భాగస్వామ్యం కీలకం: రాష్ట్రపతి ముర్ము
నర్సాపూర్లో ఫుడ్ పాయిజన్.. యువకుడి మృతి
For More TG News And Telugu News