Share News

Phone Tapping Case: డైలీ సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎంపీ రఘునందన్

ABN , Publish Date - Jan 07 , 2026 | 07:41 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కర్త, కర్మ అన్ని ఒకరి వైపే వేలు చూపిస్తున్నాయని.. కానీ ఆయనను పిలిచేందుకు భయపడుతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.

Phone Tapping Case: డైలీ సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎంపీ రఘునందన్
BJP MP Raghunandan Rao

మెదక్, జనవరి 07: ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మెదక్‌లో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్‌లా సాగుతోందని వ్యంగ్యంగా అన్నారు. కొండను తవ్వి ఎలుకను ఈ సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) పడుతుందో లేదో ? అంటూ సందేహం వ్యక్తం చేశారు. డేటాను సర్వీస్ ప్రొవైడర్ల వద్ద తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. నేడు కొండల్ రెడ్డి, రేపు ఆయన డ్రైవర్ ఇలా ఎన్నాళ్లు అంటూ? సిట్ వ్యవహారశైలిపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కర్త, కర్మ అన్ని ఒకరివైపే వేలు చూపిస్తున్నాయని.. కానీ ఆయనను పిలిచేందుకు భయపడుతున్నారంటూ రఘునందన్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందన్నారు. SIT కాస్తా CIT(కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్)లా మారిందంటూ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బాధితుడిని తానేనని గుర్తు చేశారు.


మొక్కుబడిగా ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు రఘునందన్. అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి.. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. నీటి అంశాలపై చర్చకు పాలక పక్షం మీనమేషాలు లెక్కిస్తే.. బీఆర్ఎస్ పార్టీ భయపడి పారిపోయిందని పేర్కొన్నారు. తమ సంఖ్య తక్కువ ఉన్నా గట్టిగా పోరాడి.. పాలక పక్షాన్ని బీజేపీ నిలదీసిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపి శాసనసభా పక్ష నేత మహేశ్వర రెడ్డిని అభినందిస్తున్నానని చెప్పారు.


సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగింస్తుంటే.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సభలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పాలమూరు జిల్లా మీద, కృష్ణా జలాల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇదంటూ అధికార పార్టీ సభ్యులపై నిప్పులు చెరిగారు. కొంతమంది తమ పార్టీ నుంచి వలసపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆలోచించుకోవాలంటూ వలస నేతలకు ఈ సందర్భంగా ఆయన కీలక సూచన చేశారు. యెన్నెం శ్రీనివాస రెడ్డి కూడా తమ పార్టీ నుంచి వెళ్లిన వారేనని గుర్తు చేశారు. ఆలోచించుకోవాలంటూ ఆయనకు హితవు పలికారు.


అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌లపై పోరాడేది.. ప్రజల పక్షాన ఉండేది బీజేపీ మాత్రమేనని ఎంపీ స్పష్టం చేశారు. తమ పార్టీలో కొత్త పాత అనేది ఏమీలేదని కుండబద్ధలు కొట్టారాయన. కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపిస్తే.. దేశంలో 6202వ పార్టీ అవుతుందన్నారు. ఎవరు కొత్త పార్టీ పెట్టిన తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఒక నటుడు సినిమాకు టికెట్ల ధర పెంచి మరో నటుడికి పెంచకపోతే అది పక్షపాతం అవుతుందన్నారు. అందరికీ ఒకటే రూల్ ఉండాలి.. అన్ని సినిమాలకు ఒకటే రూల్ ఉండాలని రఘునందన్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్

For More TG News And Telugu News

Updated Date - Jan 07 , 2026 | 08:14 PM