Share News

KTR Fires On CM Revanth Reddy: కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్

ABN , Publish Date - Jan 07 , 2026 | 04:49 PM

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నారన్నారు. ఆయనలో అంత ఫ్రస్టేషన్ ఎందుకో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.

KTR Fires On CM Revanth Reddy: కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్
BRS Working President KTR

హైదరాబాద్, జనవరి 07: అధికార కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలకు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల వేడి బాగా పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదబారాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతుబంధు ఏమైందని ప్రశ్నిస్తే.. లాగులో తొండలు వదులుతాం అంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నారన్నారు. ఆయనలో అంత ఫ్రస్టేషన్ ఎందుకో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. సెక్యూరిటీ వాళ్ళతో పాటు పోలీసుల్ని సైతం ఆయన కొడుతున్నారని ఆరోపించారు. ‘రేవంత్ రెడ్డి ప్రస్టేషన్‌లో ఉన్నాడని.. అరుస్తున్నాడు.. కొడుతున్నాడు.. రేపు ఎవరినైనా కరుస్తాడేమో జాగ్రత్త’ అంటూ సీఎం భార్య గీతకు ఈ సందర్భంగా కేటీఆర్ హితవు పలికారు.


ఎప్పటికప్పుడు న్యూఢిల్లీ పోయి కప్పం కట్టి వస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో కప్పం కట్టకపోతే తన పదవి ఉండదని.. ఊడిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌కి తెలుసునన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ వెళ్లి చదువుకుంటే తప్పు.. ఆయన మాత్రం ఆంధ్రాలోని భీమవరంకు చెందిన వ్యక్తిని అల్లుడిగా తెచ్చుకోవచ్చునంటూ కేటీఆర్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. తాను అమెరికాలో బాత్‌రూమ్‌లు కడుక్కుంటున్నానని అన్నారు. మరి అమెరికాలో మీ సోదరుడు జగదీష్ రెడ్డి కూడా ఉన్నాడని.. ఆయన తన ఇంట్లో ఆయనే కడుక్కోవట్లేదా? అంటూ సీఎం రేవంత్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ చురకలంటించారు. అమెరికాలో ఎవరింట్లో పనులు వాళ్ళే చేసుకుంటారని.. ఈ విషయం తెలయకుంటే తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు.. మిమ్మల్ని గెలిపించింది ఈ పనికిమాలిన డైలాగుల కోసం కాదని.. పనిచేసి చూపించాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి ఆయన స్పష్టం చేశారు.


యూరియా బస్తాల కోసం ప్రతి రోజు షాపుల ముందు రైతులు క్యూ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో యూరియా లేనప్పుడు అందుకోసం రూపొందించిన యాప్‌‌లు ఏమి చేస్తాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. యూరియా అంశంలో యాప్‌ల సమస్య రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కార్డులు తీసుకు వస్తామని ప్రభుత్వం చెబుతుందన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమేనని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ చేసిన అప్పు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించారని వివరించారు.


ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బాంబులేటి అంటూ కేటీఆర్ తనదైన శైలిలో ఆయనపై విరుచుకు పడ్డారు. తన ఇంటి మీద ఈడీ సోదాలు జరిగితే వెంటనే వెళ్లి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానితోపాటు బీజేపీ మంత్రుల కాళ్లు పట్టుకొని తన మీద కేసులు లేకుండా మాఫీ చేయించుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఖమ్మంలో ఇంకో మంత్రి ఉన్నారని.. ఆయన బీఆర్ఎస్ నాయకులను ఎత్తుకుపోతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎంత మంది నాయకులను ఎత్తుకుపోయిన తమకు బాధ లేదన్నారు. కొత్త నాయకులను తయారు చేస్తామని.. ఆ క్రమంలో యువతకి అవకాశాలు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నేడు ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందంటే.. దానికి కారణం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీనేనని గుర్తు చేశారు. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసి.. అక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఖమ్మం రూపురేఖలు మార్చామని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

For More TG News And Telugu News

Updated Date - Jan 07 , 2026 | 06:11 PM