సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:41 PM
సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.
సంగారెడ్డి, జనవరి 28: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం కర్దనూరులో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Pongulet Srinivasreddy), వివేక్ వెంకట స్వామి(Minister Vivek Venkata Swamy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధరణి వ్యవస్థను మార్చి.. భూ భారతి వ్యవస్థను తీసుకొచ్చామని.. సామాన్య ప్రజలకు ఒక చుట్టం లాంటిదిగా భూ భారతిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని వివరించారు.
అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్(ORR) పరిధిలో 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పటాన్‌చెరు ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం 3 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి అదనపు భారం పడకుండా సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. నిర్మాణ పనులను రాజ్ పుష్ప సంస్థకు అప్పగించినట్లు వివరించారు. రాబోయే 6 నెలల్లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
పెద్దపల్లిలోనూ రాజ్ పుష్ప సంస్థ.. భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ భవనాల మెయింటెనెన్స్‌ను ఐదేళ్ల పాటు సంబంధిత సంస్థలకే అప్పగించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏజెన్సీలను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మ్యారేజ్ హాల్స్, చంటి పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉండనున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా భూధార్ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఒకే ప్లాట్‌ఫాం ద్వారా భూమి సరిహద్దులు, వివరాలు అందుబాటులో ఉండనున్నాయని అన్నారు.
నిషేధిత భూముల విషయంలో అనేక వివాదాలు ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి రెండు నెలల్లో కొత్త యాప్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. భూధార్ కార్డు.. భూమి సంబంధిత అన్ని సమస్యలకు సంపూర్ణ పరిష్కారం అని, దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఫహీంలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
నేడు గద్దెపైకి సారలమ్మ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం
Read Latest Telangana News And Telugu News