Share News

సిద్దిపేట పనులను కొడంగల్‌కు తరలించారు: ఎమ్మెల్యే హరీశ్ రావు

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:16 PM

రేవంత్ రెడ్డి హయాంలో సిద్దిపేటకు కరువు, బాధలు తప్ప కొత్తగా వచ్చినది ఏమి లేదని హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట అభివృద్ధి పనులను కొడంగల్‌కు తరలించుకుపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు.

సిద్దిపేట పనులను కొడంగల్‌కు తరలించారు: ఎమ్మెల్యే హరీశ్ రావు
BRS MLA Harish Rao

సిద్దిపేట, అక్టోబర్ 11: రేవంత్ రెడ్డి హయాంలో సిద్దిపేటకు కరువు, బాధలు తప్ప కొత్తగా వచ్చినది ఏమి లేదని హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట అభివృద్ధి పనులను కొడంగల్‌కు తరలించుకుపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిపేటపై పగ పట్టిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తాను ఆజన్మాంతం సిద్దిపేట ప్రజలకు కృతజ్ఞతతో ఉంటానని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. పదవిలో ఉన్నా, లేకున్నా.. ఊపిరి ఉన్నంతకాలం సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ పండగ జిల్లాలోని ప్రతి వ్యక్తిది అని అన్నారు. సిద్దిపేటది ఓ ప్రత్యేక పరిస్థితి అని వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 100 కిలోమీటర్లు, జిల్లా కేంద్రంకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు.


రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ వచ్చాక కడుపు నిండా కరెంట్ ఇచ్చారని చెప్పారు. రైతులే కరెంట్ బంద్ చేయమని కోరేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని అన్నారు.


రేవంత్ రెడ్డి పాత రోజులు తెస్తానని చెప్పి నిజంగానే కరెంట్, అభివృద్ధి లేని రోజులు తెచ్చారంట హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ జిల్లా గొప్పగా ఉందంటే అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఘనతేనని పేర్కొన్నారు. ఒకప్పటి నినాదాలు, గోడ మీద రాతలు.. ఇప్పుడు నిజాలు అని చెప్పారు. పంటలు వేయవద్దని సీఎం రేవంత్ చెబుతున్నారని పేర్కొన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వ్యంగ్యంగా అన్నారు. ఈ రోజు బొగ్గు లేక కరెంట్ లేదని చెప్పారు. ఎల్ నీనో వస్తుందని 9 నెలల క్రితమే ఈ ప్రభుత్వానికి తెలుసునని హరీశ్ రావు చెప్పారు.


మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారంటూ ఆయన ప్రశ్నించారు. బొగ్గు నిల్వలు ఉంచుకోకుండా.. గాడిదకు పళ్ళు తోమాడని వ్యంగ్యంగా అన్నారు. కేవలం రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల ఈ కరువు వచ్చిందని మండిపడ్డారు. 24 గంటలు నడపాల్సిన మోటార్లు కేవలం 8 గంటలు నడిపితే తపస్‌పల్లి ఎలా నిండుతుందని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు కుప్పం తరలిస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలంలో, గోదావరిలో, కన్నెపల్లిలో నీళ్లున్నా, మోటార్లు ఆన్ చేయకపోవడంతో నీటి కరువు వచ్చిందని వివరించారు.


చెంపలేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మళ్ళీ గెలిచి ఉంటే హుస్నాబాద్ సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా ఆవిష్కరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అస్సాం యువతి హిమశ్రీ బోరో మృతి కేసులో కీలక ముందడుగు

నెల్లూరులో మరో 4 వేల పట్టాల పంపిణీకి కృషి చేస్తా: మంత్రి నారాయణ

Updated Date - Oct 11 , 2026 | 10:06 PM