పిలవని పేరంటానికి వెళితే.. కేసే!
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:40 AM
పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే ఫంక్షన్ హాళ్లకు ఆహ్వానం లేకుండా వచ్చి భోజనం చేసి వెళ్లే వారి కోసం వనపర్తిలోని ఒక ఫంక్షన్ హాల్ యాజమాన్యం కఠిన హెచ్చరికను చేసింది.
వనపర్తిలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం హెచ్చరిక ఫ్లెక్సీ
బీఎన్‌ఎస్ 329 కింద జైలు, జరిమానా అంటూ బోర్డు
సోషల్ మీడియాలో వైరల్.. పట్టణంలో చర్చ
ఆహ్వానం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడుతుందనడం సరికాదు
వనపర్తి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే ఫంక్షన్ హాళ్లకు ఆహ్వానం లేకుండా వచ్చి భోజనం చేసి వెళ్లే వారి కోసం వనపర్తిలోని ఒక ఫంక్షన్ హాల్ యాజమాన్యం కఠిన హెచ్చరికను చేసింది. శుభకార్యంతో సంబంధం లేని వ్యక్తులు హాల్‌లోకి వచ్చి పట్టుబడితే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 329 కింద మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తారని హెచ్చరిస్తూ హాల్ గేటు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫంక్షన్ హాళ్ల వద్ద సాధారణంగా శుభకార్యం వివరాలు, ఆహ్వానించిన కుటుంబాల పేర్లతో బ్యానర్లు కడతారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఎవరి శుభకార్యమో కూడా తెలియకుండానే లోపలికి వచ్చి భోజనం చేసి వెళుతున్నారు. దీంతో అతిథుల సంఖ్యను బట్టి భోజనం ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అదనపు భారం పడుతోంది. ఆహ్వానితులకు భోజనం సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఫ్లెక్సీ పెట్టినట్లు యాజమాన్యం చెబుతోంది.
చట్టం ఏం చెబుతోంది?
బీఎన్‌ఎ్‌స సెక్షన్ 329 నేరపూరిత అతిక్రమణ(క్రిమినల్ ట్రెస్‌పాస్) గురించి చెబుతుంది. ఇంకొకరి ఆధీనంలో ఉన్న ఆస్తిలోకి నేరం చేసే ఉద్దేశంతో, లేదా అక్కడివారిని భయపెట్టే, అవమానించే, ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రవేశిస్తే అది నేరం. చట్టబద్ధంగా లోపలికి వచ్చి, దురుద్దేశంతో అక్కడే ఉండిపోయినా ఈ నేరం కిందికే వస్తుంది. దీనికి 329(3) ప్రకారం మూడు నెలల వరకు జైలు, లేదా రూ.5 వేల వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. పాత ఐపీసీ 447లో ఈ జరిమానా రూ.500 మాత్రమే ఉండేది. ఇది కాగ్నిజబుల్, బెయిలబుల్ నేరం. ఆస్తి ఎవరి ఆధీనంలో ఉందో ఆవ్యక్తి రాజీ పడేందుకు కూడా చట్టం అవకాశం ఇస్తోంది.
భోజనానికి రావడం నేరమేనా?
పిలవని శుభకార్యానికి వెళ్లి భోజనం చేయడం సామాజికంగా తప్పు. ఆతిథ్యం ఇస్తున్నవారు తమ డబ్బుతో ఏర్పాటు చేసిన భోజనాన్ని, వారి అనుమతి లేకుండా తినడం అవుతుంది. అతిథిలా నటించి లోపలికి వెళ్లి భోజనంచేస్తే అది మోసం(బీఎన్‌ఎస్ 318)కిందికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఉద్దేశంతో ప్రవేశిస్తే నేరపూరిత అతిక్రమణగా పరిగణించవచ్చు. అయితే హాల్‌లోకి అడుగుపెట్టినంత మాత్రాన నేరం కాదు. పొరపాటున వచ్చినవారికి, తెలిసినవారి శుభకార్యం అనుకుని వచ్చినవారికి ఈ సెక్షన్ వర్తించదు. నేరపూరిత ఉద్దేశం ఉందని నిరూపించాల్సి ఉంటుంది.
శిక్ష వేయాలా, వేస్తే ఎంత వేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది.యాజమాన్యానికి హక్కుందా? హాల్‌లోకి ఎవరిని అనుమతించాలో నిర్ణయించే హక్కు యాజమాన్యానికి, హాల్‌అద్దెకు తీసుకున్న కుటుంబానికి ఉంటుంది. ఆహ్వానపత్రికలు చూపించమని అడగవచ్చు. సంబంధం లేనివారిని బయటకు పంపవచ్చు. హెచ్చరిక బోర్డు పెట్టవచ్చు. ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసునమోదు చేయవచ్చు. జరిమానా వసూలు చేసే, శిక్ష విధించే అధికారం యాజమాన్యానికి లేదు. పట్టుబడినవారిని నిర్బంధిస్తే అక్రమ నిర్బంధం(బీఎన్‌ఎస్ 127)అవుతుంది. కొడితే దాడి అవుతుంది. డబ్బులు డిమాండ్ చేస్తే బలవంతపు వసూలు అవుతుంది. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే పరువు నష్టం కేసు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ పనులు చేస్తే యాజమాన్యమే చట్టపరమైన చిక్కుల్లో పడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News