అధికారులే అసలైన అవినీతిపరులు
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:59 AM
సొంత ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం తీరుపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
నేను చెప్పినా పనులు కాలేదు..
లంచం ఇస్తేనే అవుతున్నాయి
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సొంత ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం తీరుపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈనెల 16న జడ్చర్లలో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. అధికారుల లంచగొండితనం వల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
ఓ రైతు భూమిని విరాసత్ చేయాలంటూ రెవెన్యూ అధికారులకు తాను స్వయంగా ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదని, కానీ అదే వ్యక్తి రూ. 15 వేలు లంచం ఇవ్వగానే పని పూర్తయిందని ఆరోపించారు. సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ. 5లక్షల బిల్లుకు కొందరు అధికారులు 10 నుంచి 20 శాతం లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఇటీవల జడ్చర్లలో జరిగిన ఓ కార్యక్రమంలోనూ నిధుల విడుదలపై అనిరుధ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల కావడం లేదని, మంత్రులు ఉన్న నియోజకవర్గాలకే నిధులు మంజూరు అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల మంజూరు కోసం 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అల్టిమేటం జారీ చేశారు. తాను చనిపోతేనే బిల్లులు ఇస్తామంటే చావడానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News