Share News

చిల్లర ఇవ్వలేదని.. లేడీ కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన మహిళ

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:30 AM

తీసుకున్న టికెట్‌పై చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేసింది.

చిల్లర ఇవ్వలేదని.. లేడీ కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన మహిళ
Woman Conductor Injured

  • బస్సు కిందపడి కండక్టర్‌కు తీవ్ర గాయాలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వద్ద ఘటన

అశ్వాపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తీసుకున్న టికెట్‌పై చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేసింది. దీంతో బస్సు చక్రాల కింద పడి ఆ మహిళా కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లెవెలుగు బస్సులో కల్యాణపురం స్టేజీ వద్ద మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎక్కింది. తన ఆధార్‌ కార్డు చూపడంతో పాటు కుమారుడికి హాఫ్‌ టికెట్‌ కోసం కండక్టర్‌ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చి టికెట్‌ తీసుకుంది.


తాను దిగాల్సిన మిట్టగూడేనికి వచ్చే ముందు తనకు రావాల్సిన డబ్బులు అడిగింది. చిల్లర లేవని రూ.10 చెల్లించి డబ్బులు వెనక్కు తీసుకోవాలని మౌనికను కండక్టర్‌ కోరింది. అందుకు ఆమె ససేమిరా అనడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. బస్సును పోలీ్‌సస్టేషన్‌ వద్ద ఆపుతానని కండక్టర్‌ ప్రవళిక ఫుట్‌బోర్డు వద్ద నిలుచుని చెబుతుండగా.. మౌనిక బలంగా తోసివేసింది. దీంతో కండక్టర్‌ కిందపడగా.. ఆమె కాళ్లపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రయాణికులు వెంటనే ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశ్వాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన మహిళతో పాటు బస్సును పోలీసుస్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పీర్జాదిగూడలో ఆర్థిక మోసగాడి అరెస్టు

మూతబడ్డా మాయ చేస్తున్నరు!

పౌరసరఫరాల్లో వసూళ్ల దందా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 07:17 AM