Share News

బాసర నుంచి భద్రాద్రి వరకు ‘టెంపుల్‌ కారిడార్‌’

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:32 AM

బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాలకు సరికొత్త శోభ తీసుకొచ్చి.. టెంపుల్‌ కారిడార్‌గా మారుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

బాసర నుంచి భద్రాద్రి వరకు ‘టెంపుల్‌ కారిడార్‌’

  • భావితరాలు మెచ్చేలా రామాలయ అభివృద్ధి పనులు

  • 200 ఏళ్లు నిలిచేలా నిర్మాణాలు: మంత్రి పొంగులేటి

భద్రాచలం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాలకు సరికొత్త శోభ తీసుకొచ్చి.. టెంపుల్‌ కారిడార్‌గా మారుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 200 ఏళ్లు నిలిచేలా, భవిష్యత్తు తరాలు మెచ్చేలా భద్రాచలం రామాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలంలో రామాలయ అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం సబ్‌కలెక్టరు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, విలేకరులతో మాట్లాడారు. రూ.300 కోట్లతో దేవస్థానం చుట్టూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.


భక్తులకు అసౌకర్యం కలగకుండా ముక్కోటి ఏకాదశి (డిసెంబరు 20)నాటికి రామాలయంలో ప్రధాన నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 15 రోజులకు ఒక సారి క్యాబినెట్‌ సబ్‌ కమిటీ పనులను సమీక్షిస్తుందని చెప్పారు. రూ.1100కోట్లతో గోదావరి పుష్కరాలకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పుష్కరాల వేళ భద్రాచలానికి కోటి మందిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం భద్రాచలంలో రూ.5.45కోట్లతో రంగనాయకుల గుట్టపై చేపడుతున్న అభివృద్ధి పనులకు, రూ.కోటి వ్యయంతో చేపడుతున్న గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్‌ కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్‌ వెస్లీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 05:32 AM