Share News

రాహు కేతువుల నుంచి రాష్ట్రాన్ని కాపాడండి: టీ బీజేపీ చీఫ్

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:57 PM

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్కటి మినహా హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.

రాహు కేతువుల నుంచి రాష్ట్రాన్ని కాపాడండి: టీ బీజేపీ చీఫ్
T BJP Chief N Ramachandra Rao

కొత్తగూడెం, ఫిబ్రవరి 08: తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి రాహువు అయితే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కేతువు అని టీబీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అభివర్ణించారు. రాహు కేతువుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాడు కొత్తగూడెంలో బీజేపీ విజయ సంకల్ప సభ పేరిట నిర్వహించిన భారీ సభలో ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్కటి మినహా హామీల అమలులో విఫలమైందంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్ర పథకంతో ఇంటింటికీ తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందన్నారు.


కొత్తగూడెం కార్పొరేషన్‌లో పన్నుల వసూళ్లు మినహా పనులు లేవని రాంచందర్ రావు వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనటం వెనుక ఉన్న ఆంతర్యాన్ని గమనించాలంటూ ప్రజలకు సూచించారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమి తీసుకువచ్చిన అమృత్ పథకంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ పార్టీలోని వర్గ పోరుతో కుంభకోణాలు బట్టబయలు అవుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణిలో నైనీ టెండర్ల రద్దు వెనుక కుంభకోణం ఉందని ఆరోపించారు.


సింగరేణిలో అప్పుల కారణంగా జీతాలు ఇచ్చే స్థాయిని దిగజార్చారంటూ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సూచనల మేరకు సింగరేణిపై ఇటీవల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్షించారని గుర్తు చేశారు. సింగరేణిలోని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా కార్మికులకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హామీ ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్‌లోని బీసీల లెక్క తేల్చాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభలో సభ్యత్వం లేకుండా ఒక ముస్లింకి మంత్రి పదవి కేటాయించారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు మండిపడ్డారు. ఈ రెండు పార్టీలవి ఒకే విధానాలని ఆరోపించారు.


బీఆర్ఎస్ హయాంలో కుంభకోణాల ఫైల్స్ కాలిపోయాయని.. దీంతో వాస్తవాలు బట్టబయలు కాకుండా కుట్ర జరిగిందంటూ టీ బీజేపీ చీఫ్ నిప్పులు చెరిగారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఎఫ్‌‌ఎస్‌ఎల్ ఫైల్స్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తగులబడటం వెనుక ఆంతర్యాన్ని గమనించాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా టీ బీజేపీ చీఫ్ హితవు పలికారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేసును 10 ఏళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. అవినీతి విచారణల్లో అధికారులను అరెస్ట్ చేశారని.. మరి నాయకులపై చర్యలు ఏవంటూ ఆయా పార్టీల నేతలను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిద్దాం, తెలంగాణను కాపాడు కుందామంటూ ప్రజలకు టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారు: పల్లా శ్రీనివాసరావు ధ్వజం

ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదంపై దుష్ప్రచారం: శిఖాగోయల్

For More TG News And Telugu News

Updated Date - Feb 08 , 2026 | 04:32 PM