ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదంపై దుష్ప్రచారం: శిఖాగోయల్
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:00 PM
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదంపై వివాదం రాజుకొంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని విలువైన డేటా అంతా అగ్నిప్రమాదంలో ధ్వంసమైందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయంలోని కీలక డేటా మొత్తం కాలిపోయిందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే..
హైదరాబాద్, ఫిబ్రవరి 08: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్ఎల్) కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఎఫ్‌ఎస్ఎల్ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన ఎఫ్‌ఎస్ఎల్ కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ఆమె పరిశీలించారు. అనంతరం డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం 10.08 గంటలకు ఎఫ్‌ఎస్ఎల్‌లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. ఈ కార్యాలయంలో ఉద్యోగి సాయికృష్ణ వెంటనే సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారన్నారు. ఘటన స్థలానికి ఉదయం 10.30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని వివరించారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు.
2015 ఏడాదిలో ఏసీబీకి సంబంధించిన కేసుల్లో 16 మెటీరియల్స్ ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు సమర్పించామన్నారు. అయితే రెండు కేసులకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమయ్యాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుందని చెప్పారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రెండు ముఖ్యమైన కేసుల రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా.. ఏసీబీ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం జరగలేదన్నారు. 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి వచ్చాయన్నారు. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేశామన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అందులోని ఏడు మెటీరియల్స్ కాలిపోయాయని.. వీటిని రిట్రివ్ చేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుందని చెప్పారు. ఇంత వరకు ఎంత నష్టం జరిగిందనే అంశంపై స్పష్టత లేదన్నారు.
మరోవైపు నాంపల్లి ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదంపై వివాదం రాజుకొంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని విలువైన డేటా మొత్తం అగ్నిప్రమాదంలో ధ్వంసమైందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయంలోని కీలక డేటా మొత్తం కాలిపోయిందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించిన విషయం విదితమే. ఇంకోవైపు ఈ అగ్ని ప్రమాదంపై ఇప్పటికే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో వ్యభిచార దందా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో విటులు..
మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు.. ఏ2గా నమోదు..
Read Latest Telangana News And AP News