కొత్తగూడెం వర్శిటీని ప్రపంచంలోనే టాప్-5లో నిలుపుతాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:11 PM
దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ అయిన కొత్తగూడెం యూనివర్శిటీని.. ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగూడెం మైనింగ్ కాలేజ్ స్వర్ణోత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 21: కొత్తగూడెం మైనింగ్ కాలేజ్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూనివర్శిటీలో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
మైనింగ్ కాలేజ్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూనివర్శిటీలో జాతీయ స్థాయిలో సాంకేతిక సదస్సు ఏర్పాటు చేశారు. సింగరేణి, ఓయూ, కేయూ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సును పూర్వ విద్యార్థులు - విద్యాసంస్థలు - పరిశ్రమల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి తుమ్మల ప్రసంగించారు. మైనింగ్ ఇంజనీరింగ్‌లో ఎంతో మంది నిపుణులు కొత్తగూడెం కాలేజ్ నుంచి వచ్చినవారే అని గుర్తుచేశారు. కొత్తగూడెంలో చదివిన పూర్వ విద్యార్థులు, విదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.
విద్యారంగంలో తెలంగాణ ఖ్యాతి పెరిగేలా కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్శిటీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. గిరిజన ప్రాంతంలోనే ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సహించారని.. అందుకే ఈ యూనివర్శిటీని ఖమ్మంలో ఏర్పాటు చేశామని తెలిపారు.
ఖనిజాల కాణాచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని శాస్త్రీయంగా ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఆధునిక పరిశోధనల కోసం అత్యాధునిక ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీల్లో కొత్తగూడెం యూనివర్శిటీని నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.