రూ.1000 కోట్ల లావాదేవీలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:01 AM
సంచలనం సృష్టించిన సైబర్, ఇతర ఆర్థిక నేరాల కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సైబర్ నిందితుల ఇళ్లలో సోదాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి, రాజుగూడెంలలో సీఎస్‌బీ
అధికారుల తనిఖీలు
బెంజ్ కారు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, స్థిరాస్తి పత్రాల స్వాధీనం
సత్తుపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన సైబర్, ఇతర ఆర్థిక నేరాల కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం, వేంసూరు మండలం రాజుగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు నిందితుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. సీఎస్‌బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు స్థానిక పోలీసుల సాయంతో సైబర్ కేసుల్లో అరెస్టయిన నాగప్రసాద్, సతీశ్‌ల ఇళ్లలో సోదాలు చేశారు. అయితే, సీఎస్‌బీ అధికారులు రావడానికి ముందే వారు బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.
సత్తుపల్లిలోని బొప్పన నాగప్రసాద్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. మెర్సిడెజ్ బెంజ్ కారు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది. వేంసూరు మండలం రాజుగూడెం గ్రామానికి చెందిన మరో నిందితుడు మేడా సతీశ్ ఇంట్లోనూ తనిఖీలు చేసిన అధికారులు స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. సైబర్, ఇతర ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై గత జనవరి నుంచి వీఎం బంజర, సత్తుపల్లి పట్టణ పోలీస్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి.
ఆయా కేసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పలువురు నిందితులు రూ.1000 కోట్లపైనే ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని తేల్చారు. అంతర్జాతీయ సైబర్ క్రైం నేరస్థులతో జతకట్టి ఆస్ట్రేలియా, కంబోడియా తదితర దేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ వాటి ద్వారా మన దేశంతో పాటు ఇతర దేశాల వారినీ మోసగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కొల్లగొట్టిన సొత్తును మ్యూల్ ఖాతాల ద్వారా మళ్లించి సొమ్ము చేసుకున్నారని తెలిసింది. ఈ రెండు కేసుల్లో 55 మందిని అరెస్టు చేశారు. వారిలో నాగప్రసాద్, సతీశ్ కూడా ఉన్నారు. సతీశ్ ఖాతా ద్వారా రూ.135.48 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సతీ్‌షతో పాటు ఆయన సోదరి భానుప్రియ, బావ మనోజ్‌కల్యాణ్‌లను కూడా అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం
ధాన్యం సేకరణకు 58 వేల కోట్ల ప్రభుత్వ గ్యారంటీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News