ధాన్యం సేకరణకు 58 వేల కోట్ల ప్రభుత్వ గ్యారంటీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:52 AM
రైతుల నుంచి ధాన్యం సేకరణకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కోసం పౌరసరఫరాల సంస్థకు రూ. 58 వేల కోట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ధాన్యం సేకరణకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కోసం పౌరసరఫరాల సంస్థకు రూ. 58 వేల కోట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. గతంలో ఉన్న రూ. 53 వేల కోట్ల గ్యారంటీ పరిమితిని రూ. 58 వేల కోట్లకు పెంచాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గానికి పౌరసరఫరాల సంస్థ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదేక్రమంలో 2026- 27 ఖరీఫ్, యాసంగి సీజన్లలో ధాన్యం సేకరణ కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చటం, అదనపు రుణ సదుపాయం కల్పించటం, ప్రభుత్వ గ్యారెంటీ పరిమితిని పెంచటం, మార్క్‌ఫెడ్‌ను అదనపు నోడల్ ఏజెన్సీగా నియమించటం లాంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఖరీఫ్ 2026- 27 సీజన్‌కు సంబంధించి ఎన్‌సీడీసీ(నేషనల్ కో-ఆపరేటివ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్), ఇతర బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు సరిపోని పక్షంలో... ఆర్‌బీఐ నుంచి రూ.17,300 కోట్ల అదనపు రుణం తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు కల్పించింది.
కాగా ఈ సంస్థతోపాటు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ సమాఖ్య(టీజీ మార్క్‌ఫెడ్)ను అదనపు నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు సంస్థలు కలిసి ఖరీఫ్ సీజన్‌లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పనిచేస్తాయి. మార్క్‌ఫెడ్‌కు ఇప్పటికే ఉన్న రూ. 26,500 కోట్ల రుణ పరిమితిని రూ. 43,800 కోట్లకు పెంచేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం
హైస్పీడ్ రైళ్ల అలైన్‌మెంట్ ఖరారు కాలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News