జపాన్‌లో విద్యార్థుల భాగస్వామ్యమే అధికం
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:51 AM
జపాన్‌లో ఎలిమెంటరీ పాఠశాలలు కూడా ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాలలను పోలి ఉంటాయని.. అక్కడ విద్యకు సంబంధించిన ప్రతి విషయంలోనూ విద్యార్థుల భాగస్వామ్యం ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అన్నారు.
అక్కడి విద్యాసంస్థల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు వారే శుభ్రం చేసుకుంటారు
అక్కడి ఉత్తమ విధానాల అమలుకు చర్యలు: కొత్తగూడెం కలెక్టర్ అంకిత్
జపాన్ అధ్యయన పర్యటన వివరాల వెల్లడి
కొత్తగూడెం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జపాన్‌లో ఎలిమెంటరీ పాఠశాలలు కూడా ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాలలను పోలి ఉంటాయని.. అక్కడ విద్యకు సంబంధించిన ప్రతి విషయంలోనూ విద్యార్థుల భాగస్వామ్యం ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అన్నారు. అక్కడి విద్యాసంస్థల్లో విద్యార్థులే తరగతి గదులు, పరిసరాలు, మరుగుదొడ్లు సైతం వారే శుభ్రం చేసుకుంటారని.. మధ్యాహ్న వేళ భోజనాల్లోనూ వారి ప్రాతినిధ్యం ఉంటుందని వివరించారు. జపాన్‌లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ఇక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దశల వారీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో జపాన్ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను జిల్లా అవసరాలకు అనుగుణంగా అమలు చేస్తామన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దోహదపడే అంశాలపై అధ్యయనం కోసం నీతి ఆయోగ్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సంయుక్తంగా ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన జపాన్ అధ్యయన పర్యటనలో వివిధ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లతో కలిసి ఆయన కూడా పాల్గొన్నారు. బుధవారం కొత్తగూడెం ఐడీవోసీ కార్యాలయంలో మీడియాతో సమావేశమై పర్యటన వివరాలను వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ అతి తక్కువ సమయంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. కేవలం 12 కోట్ల మంది జనాభా మాత్రమే ఉంటారని.. అక్కడున్న ప్రతి వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని తెలిపారు.
కార్పొరేట్ స్థాయిలో వ్యవసాయం కొనసాగుతోందని.. పంట రుణాలు, ఇతర సదుపాయాలు ఒకే వేదిక ద్వారా అందిస్తున్నారని చెప్పారు. 300-400 మంది రైతులను గ్రూపులుగా చేర్చి మార్కెటింగ్, ఎగుమతులకు అనుకూలమైన పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తారన్నారు. అక్కడి విధానాల్లో అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ లేదా గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేసి మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఒక ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిక చేసి మోడల్ విధానంలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News